అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో 120 రకాల పంటలు పండే భూములను బలవంతంగా సేకరించేందుకు ప్రభుత్వం సిద్ధపడితే ఎదురుతిరగాలని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ రైతులకు పిలుపిచ్చారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో రాజధాని ప్రాంత రైతులతో ఆదివారం ఆయన సమావేశమయ్యారు. 

విజయవాడలోని తన నివాసంలో కృష్ణా, గుంటూరు జిల్లాల నాయకులతో భేటీ అయ్యారు. రైతుల పోరాటానికి అండగా నిలుస్తానని, పోలీసులు తూటాల ద్వారా భయపెట్టాలని చూస్తే ముందు తన గుండె చూపుతానని ఆయన అన్నారు. వేయి తూటాలను ఎదిరించైనా భూసేకరణను ఆపుతానని ఆయన అన్నారు. 

మూడు పంటలు పండే భూములను మెట్ట పొలాలుగా చూపి దోపిడీ చేస్తారా పవన్ ప్రశ్నించారు.సింగూర్‌, బషీర్‌బాగ్‌ వంటి ఘటనలు పునరావృతం కావాలని ప్రభుత్వం కోరుకుంటోందా అని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు .బషీర్‌బాగ్‌లో రైతులపై కాల్పులు జరిపించి అధికారానికి దూరమయ్యారని ఆయన గుర్తు చేశారు. 

అందరి ఆనందంతోనే రాజధాని నిర్మాణం జరగాలని, కొందరి ఆవేదన, చావులు, ఏడుపులు, హృదయ గాయాలతో కూకూడదని ఆయన అన్నారు.. విశాఖ స్టీల్‌ ప్లాంటు కోసం ఏనాడో 24 వేల ఎకరాలు తీసుకుని, 12 వేల ఎకరాలలోపే వినియోగించారని ఆయన అన్నారు. భూములు కోల్పోయినవారిలో కొందరు కూలీలుగా మారారని, కొందరు గుళ్లో ప్రసాదాలు తిని బతుకుతున్నారని, ఈ అవస్థ రైతుకు, రైతు కూలీలకు రాకూడదని,  రైతులతో కన్నీళ్లు పెట్టించినవాళ్లు సర్వనాశనమవుతారని అన్నారు.