మెగా అభిమానులంతా జనసేన పార్టీ పక్షాన నిలిచి 2024 లో పవన్ కల్యాణ్ ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుబెట్టాలని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు స్వామినాయుడు కోరారు. 

విజయవాడ: 2024లో పవన్ కళ్యాణ్ ను సిఎం చేయడమే మెగా అభిమానులు లక్ష్యంగా పెట్టుకోవాలని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు స్వామినాయుడు సూచించారు. గ్రామగ్రామానికి జనసేన పార్టీని తీసుకుని వెళ్లాలని... ఇందుకోసం తమవంతు కృషి చేయాలని మెగా అభిమానులకు ఆయన సూచించారు. మెగా ఫ్యామిలీ హీరోలందరి అభిమానులు జనసేన నాయకులతో కలిసి రాష్ట్రంలోని ప్రతిచోటా పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయనున్నట్లు స్వామినాయుడు తెలిపారు. 

విజయవాడలో జరిగిన మెగా అభిమానులు (mega family) ఆత్మీయ సమ్మేళనంలో స్వామినాయుడు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ (pawan kalyan) తోనే నడుస్తారని స్పష్టం చేసారు. ప్రతి గ్రామంలో అందరం కలిసి పనిచేస్తూ జనసేన పార్టీ (janasena party)ని అధికారంలోకి తీసుకువచ్చేలా ప్రణాళిక బద్దంగా ముందుకు వెళతామన్నారు. ఈ సమావేశం తర్వాత మరికొన్ని సమావేశాలు కూడా నిర్వహిస్తామని... అనంతరం కార్యాచరణ సిద్దం చేస్తామని స్వామినాయుడు తెలిపారు. 

''మెగా అభిమానులకు, నాయకులకు మధ్య అంతరాలు లేవు. జనసేన పార్టీ ఆదేశాలను పాటిస్తూ ముందుకు వెళతాం. మెగా అభిమానులు అందరూ జనసేన కార్యకర్తలుగా పని చేస్తారు. పొత్తుల అంశం మా పరిధి కాదు... పెద్దలు నిర్ణయిస్తారు'' అని స్వామినాయుడు స్పష్టం చేసారు. 

Video

''గతంలో మెగాస్టార్ చిరంజీవి (megastar chiranjeevi) స్థాపించిన ప్రజారాజ్యం పార్టీపై అనేక కుట్రలు చేశారు. ఆనాడు కుటుంబాలు వదిలి చిరంజీవి కోసం పని చేశాం. ఇప్పుడు మళ్లీ జనసేనపై అసత్యాలు, పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఈ కుట్రలను సాగనివ్వకుండా పవన్ కళ్యాణ్ సిఎం కావడం కోసం అందరూ సంకల్పంతో పని చేయాలి'' అని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు స్వామినాయుడు మెగా అభిమానులకు సూచించారు. 

ఇటీవల సినీ సమస్యల పరిష్కారం, టికెట్ల వివాదంపై చర్చించేందుకు టాలీవుడ్ పక్షాన హీరో చిరంజీవి ఏపీ సీఎం జగన్ తో భేటీ అయ్యారు. అయితే ఈ భేటీలో సినీ పరిశ్రమ సమస్యలతో పాటు రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చాయని ఓ ప్రముఖ ఆంగ్ల ప్రతికలో కథనం వచ్చింది. చిరంజీవికి జగన్ రాజ్యసభ ఆఫర్ చేసినట్టుగా సీఎం కార్యాలయం సన్నిహిత వర్గాలు చెప్పినట్టుగా ఆ కథనంలో పేర్కొన్నారు. దీంతో చిరంజీవి రాజ్యసభ సీటు కోసమే జగన్‌ను కలిశారా అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌తో పాటుగా సోషల్ మీడియాలో విపరీతంగా సాగింది. 

పవన్ కల్యాణ్ కు చెక్ పెట్టేందుకే చిరంజీవిని సీఎం జగన్ దగ్గరకు తీస్తున్నట్లు ప్రచారం జరిగింది. చిరంజీవికి రాజ్యసభ ఇవ్వడం ద్వారా పవన్ నే కాదు ఇటు కాపు సామాజికవర్గానికి దగ్గరయ్యేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది. అయితే ఇటీవల వైసిపి రాజ్యసభ అభ్యర్థుల ప్రకటనతో ఈ ప్రచారానికి తెరపడింది. దీంతో మెగా అభిమానులకు కూడా ఓ క్లారిటీ రావడంతో అందరు హీరోల అభిమానులు కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలోనే విజయవాడలో మెగా అభిమానుల ఆత్మీయన సమ్మేళనం ఏర్పాటుచేసుకున్నారు.