తిరుమల శ్రీవారి నగల విషయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్ల బాంబు పేల్చారు. నిన్న సాయంత్రం నుంచి తన అధికారిక ట్విట్టర్ ఖాతా నుంచి ట్వీట్లు చేస్తూ టీడీపీ నేతలకు వణుకు పుట్టించారు. ఇందులో ప్రభుత్వ అవినీతి, అమరావతి భూసేకరణ, రమణ దీక్షితుల ఆరోపణలు, శ్రీవారి నగలు తదితర అంశాలపై స్పందించారు. కొన్నేళ్ల క్రితం నేను హైదరాబాద్‌లోని ఎయిర్‌పోర్ట్‌ లాంజ్‌లో ఉండగా.. ఓ సీనియర్ ఐపీఎస్ అధికారిని కలిశానని.. ఆయన అదృశ్యమైన శ్రీవారి ఆభరణాల గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారని పేర్కొన్నారు..  

ఆయన చెప్పిన దాని ప్రకారం.. స్వామి వారి నగలు ఓ ప్రైవేట్ విమానంలో విదేశాలకు తరలివెళ్లాయన్నారు.. నాకు తెలిసిన విషయం టీడీపీ నేతలకు, ప్రతిపక్షనేతలకు కూడా తెలుసునని.. అందువల్లే రమణ దీక్షితులు చేస్తున్న ఆరోపణలు నాకు ఏమాత్రం ఆశ్చర్యంగా అనిపించలేదన్నారు. వెంకటేశ్వరస్వామి మౌనంగా ఉన్నారని ఆ దొంగలు భావిస్తున్నారని.. అందుకే ఆ నగలు దొంగిలించవచ్చునని ఆ దొంగలు అనుకుంటున్నారని పవన్ పేర్కొన్నారు..

అంతకు ముందు మాయమైందని చెబుతున్న పింక్ డైమండ్ ఇతర నగలకు సంబంధించిన అంశంపై స్పందిస్తూ.... నగల అదృశ్యం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెబుతున్న సమాధానాలు సంతృప్తికరంగా లేవని ఆరోపించారు.. స్వామి వారి ఊరేగింపు సందర్భంగా భక్తులు నాణేలు విసరడంతో పింక్ డైమండ్ పగిలిపోయిందని అధికారులు చెబుతున్నారని.. అయితే ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో అది ఎలా పగులుతుందో చూపించాలని పవన్ సవాల్ విసిరారు.

స్వామి వారి నగలు  కాజేసిన వారికి కచ్చితంగా శిక్ష తప్పదని.. విషయాన్ని ప్రభుత్వం కావాలని పక్కదారి పట్టిస్తుందని జనసేన అధినేత అన్నారు. దీనికి ఏ విధంగా ముగింపు పలుకుతారోనని దేశం మొత్తం టీడీపీ, వైసీపీల వైపు చూస్తొందని.. ఇప్పటికైనా వారు స్పందించాలని పవన్ కోరారు. ఇక ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్ పైన కూడా జనసేనాని స్పందించారు. టీడీపీ, వైసీపీ నేతలు న్యూక్లియర్ ప్లాంట్ విషయంలో తమ స్టాండ్ ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.. అంతేకాదు, న్యూక్లియర్ ప్లాంట్ విషయంలో ఈఏఎస్ శర్మ, పీఎంవో, భారత ప్రభుత్వం ఎదుట లేవనెత్తిన అభ్యంతరాలు అంటూ కొన్ని ట్వీట్లు పెట్టారు.