అమరావతి: అమరావతి రైతుల పేరుతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్దకు ఎవరు వెళ్లారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎర్రబాలెం రైతులను అడిగారు. ఆయన శనివారంనాడు ఎర్రబాలెం రైతుల దీక్షకు మద్దతు ప్రకటించారు.

జగన్ వద్దకు వెళ్లి రాజధాని అవసరం లేదు, మాకు భూములు ఇవ్వాలని అడిగినవారు ఎవరని ఆయన ప్రశ్నించారు. కొందరు డ్రైవర్లు, పనివాళ్లు రైతుల ముసుగులో వైసీపీ నేతలతో కలిసి జగన్ వద్దకు వెళ్లారని రైతులు పవన్ కల్యాణ్ తో చెప్పారు.

ఢిల్లీ పెద్దలతో రాజధాని విషయంపై తాను మాట్లాడినట్లు, అమరావతి రాజధానిగా ఉండాలని వాళ్లు తనకు స్పష్టంగా చెప్పినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. ఢిల్లీ శాసనసభ ఎన్నికల దృష్ట్యా బిజెపితో కలిసి తలపెట్టిన ర్యాలీని వాయిదా వేసినట్లు ఆయన చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న విస్తారమైన అధికారాల వల్ల కేంద్రం కూడా ఏమీ చేయలేకపోతోందని పవన్ కల్యాణ్ అన్నారు రాజధాని రైతుల కోసం తప్పకుండా ర్యాలీ చేస్తానని ఆయన అన్నారు. ఎవరు వచ్చినా రాకపోయినా తాను రైతుల వెంట ఉంటానని ఆయన స్పష్టం చేశారు.

మూడు రాజధానుల ఏర్పాటును ప్రధాని మోడీకి, కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు చెప్పే చేస్తున్నామని వైసీపీ నేతలు అంటున్నారని, ఢిల్లీ బిజెపి నేతలు ఓ రకంగా, రాష్ట్ర బిజెపి నేతలు మరో రకంగా మాట్లాడుతున్నారని  చెప్పి దాన్ని సరిచేసుకోవాలని సూచించానని పవన్ కల్యాణ్ చెప్పారు. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య ఏదైనా జరిగితే అది రాతపూర్వకంగానే ఉంటుందని, కేంద్రం అంగీకరించినట్లుగా వైసీపీ వద్ద అటువంటి ఉత్తరప్రత్యుత్తరాలకు సంబంధించిన సమాచారం ఉందేమో అడగాలని బిజెపి నేతలు చెప్పారని ఆయన అన్నారు. 

కేంద్రం జోక్యం చేసుకునే విషయంలో కొన్ని పరిమితులు ఉంటాయని, అమరావతి నుంచి రాజధానిని మార్చే విషయంలో కేంద్రం జోక్యం చేసుకోలేదని ఆయన చెప్పారు. పశ్చిమ బెంగాల్ లో అమిత్ షా విమానాన్ని ల్యాండ్ కాకుండా అక్కడి ప్రభుత్వం అడ్డుకుందని, దానిపై కేంద్రం ఏమీ చేయలేదని, అటువంటి అధికారాలు రాష్ట్రాలకు ఉంటాయని ఆయన వివరించారు. 

అమరావతి రాజధానిగా ఉండాలనేది తమ వైఖరి అని, దాని కోసం పోరాడుదామని బిజెపి నేతలు చెప్పారని ఆయన అన్నారు. తప్పకుండా తాను పోరాటం చేస్తానని ఆయన చెప్పారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమరావతి గ్రామాల పర్యటన షెడ్యూల్ మారింది. ఆయన శనివారం ఉదయం యర్రబాలెం చేరుకున్నారు. యర్రబాలెం నుంచి నేరుగా ఆయన అనంతవరం‌ వెళ్లనున్నారు.  

అక్కడ రైతులతో కలిసి‌ వెంకన్న సన్నిధి‌ వరకు పాదయాత్ర లో పాల్గొంటారు. మధ్యాహ్నం నుంచి తుళ్లూరు, రాయపూడి, వెలగపూడి, మందడం గ్రామాలలో  పవన్ కల్యాణ్ పర్యటిస్తారు.