ఈ నెల 9న ఏలూరు నుండి రెండో విడత వారాహి యాత్ర: రూట్ పై పార్టీ నేతలతో పవన్ చర్చ
పవన్ కళ్యాణ్ వారాహి రెండో విడత యాత్ర ఈ నెల 9వ తేదీ నుండి ప్రారంభం కానుంది.
ఏలూరు: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర రెండో విడత ఈ నెల 9వ తేదీ నుండి ప్రారంభం కానుంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నేతలతో చర్చించిన తర్వాత ఈ యాత్రకు సంబంధించిన షెడ్యూల్ ను ప్రారంభించనున్నారు. ఏలూరు నుండి రెండో విడత వారాహి యాత్రను ప్రారంభించాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.
ఉభయ గోదావరి జిల్లాలోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వారాహి యాత్ర నిర్వహించనుంది. ఇప్పటికే 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వారాహి యాత్ర పూర్తైంది. మరో 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యాత్ర నిర్వహించనున్నారు. ఈ నెల 6,7,8 తేదీల్లో రాజమండ్రిలో పార్టీ ముఖ్యనేతలతో పవన్ కళ్యాణ్ చర్చించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వారాహి యాత్రపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. నిన్నటితో వారాహి యాత్ర తొలి విడత పూర్తైంది.
also read:జగన్ గురించి పుస్తకం రాయాలి: రౌడీలా మాట్లాడారని పవన్ పై అంబటి ఫైర్
ఈ నెల 14వ తేదీన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని కత్తిపూడి జంక్షన్ సభ ద్వారా పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను ప్రారంభించారు. అన్నవరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఉభయ గోదావరి జిల్లాల్లో వైఎస్ఆర్‌సీపీ జెండా ఎగురనీయబోమని పవన్ కళ్యాణ్ వైఎస్ఆర్‌సీపీ నేతలకు తేల్చి చెప్పారు. ఈ రెండు జిల్లాలపై పవన్ కళ్యాణ్ కేంద్రీకరించారు. పవన్ కళ్యాణ్ పై అంతే స్థాయిలో వైఎస్ఆర్‌సీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. వచ్చే ఏడాదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం అసెంబ్లీ స్థానం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేశారు. అయితే ఈ రెండు స్థానాల్లో పవన్ కళ్యాణ్ ఓటమి పాలయ్యాడు. ఉభయ గోదావరి జిల్లాల్లో కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు ఆయా పార్టీల గెలుపు ఓటములపై ప్రభావం చూపుతారు. దీంతో ఈ రెండు జిల్లాలపై పవన్ కళ్యాణ్ కేంద్రీకరించారు.