హైదరాబాద్: రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న మాజీ మంత్రి దాడి వీరభద్ర రావు జనసేనలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. పక్కా రాజకీయ వ్యూహంతో ఉత్తరాంధ్ర పోరాట యాత్ర చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ దాడి వీరభద్ర రావుకు ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానిస్తారని అంటున్నారు.

నిజానికి, పవన్ కల్యాణ్ యాత్రకు ఇచ్చే ప్రాధాన్యం కన్నా తన కోసం వచ్చేవారిని కలుసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకుని ఆయన చేరికలకు శ్రీకారం చుట్టారు. 

తెలుగుదేశం పార్టీలో అవకాశం కోసం ఎదురు చూసి విసిగిపోయిన కోన తాతారావు జనసేనలో చేరారు.   గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య కూడా చేరారు. మాజీ కాంగ్రెస్‌ నాయకుడు బాలసతీశ్‌ జనసేనలో చేరారు. రెండు దశాబ్దాల క్రితం సబ్బం హరి మేయరుగా పనిచేసిన కాలంలో ఆయన విశాఖ నగరం యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులుగా చేశారు. 

గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీలోకి వచ్చి విశాఖ ఎంపీగా బరిలో దిగిన బొలిశెట్టి సత్యనారాయణ జనసేనలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా పీసీసీ కార్యదర్శి గుంటూరు నర్సింహమూర్తి, ఆయన భార్య గుంటూరు భారతి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. వీరు కూడా జనసేనలో చేరుతారని ప్రచారం సాగుతోంది. 
 
పవన్‌కల్యాణ్‌ మంగళవారం అనకాపల్లి పర్యటనకు వెళుతున్నారు. ఈ సందర్భంలో పవన్ కల్యాణ్ దాడి వీరభద్రరావు ఇంటికి వెళ్తారని అంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి బయటకు వచ్చేసిన తరువాత దాడి వీరభద్రరావు, ఆయన తనయుడు రత్నాకర్‌ రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరడానికి దాడి వీరభద్రరావు ప్రయత్నించినట్లు కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. 

చోడవరంలో పీవీఎస్‌ఎన్‌ రాజు మంగళవారం జనసేన పార్టీలో చేరుతున్నారు. ఈయన కొన్నాళ్లు వైఎస్సాఆర్‌ సీపీలోను, ఆ తర్వాత తెలుగుదేశంలోను పనిచేశారు. ఈ నెల 8వ తేదీ వరకు పవన్‌కల్యాణ్‌ విశాఖపట్నంలో ఉంటారు. ఈ లోపల మరిన్ని చేరికలు ఉంటాయని అంటున్నారు.