Asianet News TeluguAsianet News Telugu

అప్పుడే కేంద్ర మంత్రిని అయి ఉండేవాడ్ని, కానీ...: పవన్ కల్యాణ్

రాష్ట్రం విడిపోవడానికి నీళ్లు, నిధులు, నియామకాలే కారణమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.

Pawan Kalyan says reasons for the bifurcation

శ్రీకాకుళం: రాష్ట్రం విడిపోవడానికి నీళ్లు, నిధులు, నియామకాలే కారణమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జనసేన పోరాట యాత్రలో భాగంగా ఆయన సోమవారం పాలకొండ బహిరంగ సభలో మాట్లాడారు. ఉత్తరాంధ్ర వెనకబాటుకు కారణం పాలకులేనని ఆయన అన్నారు. ప్రత్యేక హోదాపై మొదటి నుంచీ చిత్తశుద్ధి ఉంటే ఉత్తరాంధ్ర వెనకబడి పోయేది కాదని అన్నారు. 

ఉత్తరాంధ్ర వెనకబాటుతనం పోవాలంటే నీళ్లు, నిధులు, నియమాకాలు ఉండాలని ఆయన అన్నారు. పుష్కరాలకు 2 వేల కోట్లు ఖర్చు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తోటపల్లి రిజర్వాయర్ కోసం 265 కోట్ల రూపాయలు ఇవ్వలేకపోయారని విమర్శించారు. 

తాను బలమైన సంకల్పంతో రాజకీయాల్లోకి వచ్చినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. తాను కావాలంటే 2014లోనే పోటీ ఎమ్మెల్యేను అయి ఉండేవాడినని, కేంద్ర మంత్రిని అయి ఉండేవాడినని, కానీ ప్రజల్లోకి వచ్చి సమస్యలను తెలుసుకోవాలనే ఉద్దేశంతో అలా చేయలేదని అన్నారు. 

హైదరాబాదు విషయంలో జరిగిన తప్పు అమరావతి విషయంలో జరగకూడదని, అభివృద్ధి అంతా అమరావతిలోనే కేంద్రీకృతమవుతోందని, శ్రీకాకుళం వంటి ప్రాంతాలకు పెట్టుబడులు రావాలంటే అలాంటి కేంద్రీకృత అభివృద్ధి మంచిది కాదని అన్నారు. 

కోడి రామమూర్తి స్ఫూర్తితో తాను మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నట్లు తెలిపారు. ఉత్తరాంధ్ర వెనకబాటుతనం వల్లనే తాను కష్టసాధ్యమైన ఇక్కడ నిరసన కవాతు చేస్తున్నానని ఆయన చెప్పారు. వెనకబాటు తనానికి చాలా బాధపడుతున్నట్లు తెలిపారు. 

పాలకులు మాట మార్చి ప్రజలకు న్యాయం చేయనప్పుడు ప్రజల్లో సైన్యం వస్తుందని, అదే జనసైన్యమని ఆయన అన్నారు. ఉత్తరాంధ్ర బలమైన శక్తిగా మారకపోతే వెనకబాటుతనం ఇలాగే ఉంటుందని అన్నారు. ఉత్తరాంధ్రను స్థానిక నాయకులు మరిచిపోయారే గానీ పవన్ కల్యాణ్ మరిచిపోలేదని అన్నారు. రైతు కంటనీరు పెడ్తే చాలా బాధేసిందని అన్నారు.  ఉత్తరాంధ్రకు పాలకులు ద్రోహం చేశారని, దాన్ని ఎదుర్కోవడానికే మీ ముందుకు వచ్చానని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios