అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఝలక్ ఇచ్చారు. ఈనెల 30న చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించబోయే అఖిలపక్ష సమావేశానికి తాము హాజరుకాబోమంటూ పవన్ కళ్యాణ్ బహిరంగ లేఖ రాశారు. 

సమావేశానికి ఒక్కరోజు ముందు ఆహ్వానాలు అందిస్తారా అంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధికోసమే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించినట్లు పవన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మెుక్కుబడిగా నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి జనసేన పార్టీ దూరంగా ఉంటుందని స్పష్టం చేశారు. 

రేపు సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈరోజు ఆహ్వానాలు అందిస్తారా అంటూ మండిపడ్డారు. అఖిలపక్ష సమావేశంలో ఎలాంటి అంశాలపై చర్చిస్తారో స్పష్టమైన నిర్ణయం చెప్పలేదని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే అఖిలపక్ష సమావేశానికి తమను ఆహ్వానించడంపై పవన్ కృతజ్ఞతలు తెలిపారు.

 ప్రత్యేక హోదా, పునర్విభజన చట్టంలోని హామీల అమలుపై ఇతర పార్టీలతో కలిసి పోరాటం చేస్తామని పవన్ లేఖలో పొందరుపరిచారు. చిత్తశుద్ధితో చేసే పోరాటాలకు జనసేన మద్దతు ఇస్తుందని తెలిపారు. అజెండా ఏంటో ప్రకటించకుండా నిర్వహించబోతున్న అఖిలపక్ష సమావేశం రాజకీయ లబ్ధియేనని పవన్ లేఖలో ప్రస్తావించారు.  

బలమైన పోరాటాల ద్వారానే ప్రత్యేక హోదా సాధ్యమవుతుందని పవన్ సూచించారు. ఇకపోతే చంద్రబాబు నాయుడు నిర్వహించబోయే అఖిలపక్ష సమావేశానికి ఇప్పటికే వైసీపీ హాజరుకాబోమని స్పష్టం చేసింది. అటు బీజేపీ హాజరు కావడం లేదు. తాజాగా జనసేన కూడా దూరమైంది. 

ప్రస్తుతం చంద్రబాబు అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్ పార్టీ, ప్రత్యేక హోదా సాధన సమితి, ప్రజా సంఘాలు మాత్రమే మద్దతు ప్రకటించాయి. అయితే వామపక్ష పార్టీలు మిత్రపక్షమైన జనసేన నిర్ణయానికి కట్టుబడి ఉంటాయా లేక వెళ్తాయా అన్నది వేచి చూడాలి.