Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లోని ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపులు బీభత్సం సృష్టించాయి. పంటలు దెబ్బతినడంతో పాటు ఒక రైతు ప్రాణాలు కోల్పోయిన క్రమంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమీక్ష నిర్వహించారు. తక్షణ చర్యలకు ఆదేశించారు.
AP Deputy Chief Minister Pawan Kalyan: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడుల కారణంగా పంటలు నష్టపోవడం, రైతుల ప్రాణాలు కోల్పోవడం పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే పవన్ అటవీశాఖ అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.
ఇటీవల చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లులో ఓ కౌలురైతు ఏనుగుల దాడిలో మరణించిన ఘటనతో పాటు, పాకాల మండలం గానుగపెంటలో పంటల నష్టం జరిగిన నేపథ్యంలో తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎనుగుల గుంపు పట్ల అధికారులు అప్రమత్తంగా లేకపోవడంపై సీరియస్ అయ్యారు. ఏనుగుల నుంచి ప్రజలకు, ప్రజల నుంచి ఏనుగులకు హాని కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఈ నేపథ్యంలోనే ఎలిఫెంట్ కారిడార్ లోని ఏనుగుల కదలికలను ఆధునిక టెక్నాలజీతో ట్రాక్ చేయడం, ఎలిఫెంట్ ట్రాకర్స్ సేవలు వినియోగించడం, ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. తిరుపతి డి.ఎఫ్.ఓ. శ్రీ పి.వివేక్ నేతృత్వంలో ఈ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కాగా, ఇందులో చిత్తూరు డి.ఎఫ్.ఓ. శ్రీమతి ఎస్.భరణి, ఇతర అధికారులతో పాటు పది మంది ఎలిఫెంట్ ట్రాకర్స్ ఉన్నారు.
