తిరుపతి: తెలుగుదేశం పార్టీకి  మద్దతు ఇచ్చినవారికే న్యాయం చేయకపోతే ఇంకెవరికి న్యాయం చేస్తారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆయన బుధవారం శెట్టిపల్లి భూనిర్వాసితులు, రైతులతో సమావేశమై మాట్లాడారు.

ఓటు వేసినవారే తిరగబడుతున్నారని టీడిపి గుర్తించాలని ఆయన అన్నారు. గ్రామాల పట్ల టీడిపి ప్రభుత్వం కక్షపూరిత వైఖరిని ప్రదర్శిస్తోందని ఆయన అన్నారు. రైతులకు అన్యాయం చేస్తున్నారని, అన్యాయం చేస్తే చూస్తూ కూర్చోబోమని అన్నారు. 

అనుభవం ఉన్నవారు ముఖ్యమంత్రిగా ఉంటే మేలు జరుగుతుందని తాను గత ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడిపికి మద్దతు ఇచ్చానని ఆయన చెప్పారు. టీడీపి ప్రభుత్వం ఏర్పడడానికి ప్రత్యేక శ్రద్ధ చూపానని ఆయన అన్నారు.

 అమరావతి నుంచి శెట్టిపల్లి వరకు గట్టుకో న్యాయం చెట్టుకో న్యాయంలా చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. దోపిడీ జరుగుతుంటే మౌనంగా కూర్చునే రోజులు పోయాయని అన్నారు.  ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు 

వేల కోట్లు దోచుకునే తెలివితేటలు ఉన్నప్పుడు 600 ఎకరాల భూములను కాపాడే తెలివితేటలు ఎందుకు లేవని ఆయన అడిగారు. బిందెడు నీళ్లు ఆశ చూపి మూడు చుక్కల నీరు పోసినట్లుగా ప్రభుత్వం తీరు ఉందని అన్నారు.