హైదరాబాద్: తనకు ఉన్న కోపానికి తాను ఎక్కడ నక్సలైట్ల ఉద్యమంలో చేరుతారనే ఉద్దేశ్యంతో అన్నయ్య చిరంజీవి తనకు రివాల్వర్ కొనిచ్చారని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ చెప్పారు.సమాజంలో జరుగుతున్న అన్యాయంపైనే తన కోపం ఉంటుందని ఆయన చెప్పారు. తుపాకీపై ఇష్టంతోనే తాను నక్సల్స్ ఉద్యమం వైపు పట్ల ఆకర్షితం కాలేదన్నారు.

గురువారం నాడు విశాఖ జిల్లాలోని ఓ స్టేడియంలో నిర్వహించిన జనసేన కార్యకర్తల సమావేశంలో  పవన్ కళ్యాణ్ ప్రసంగించారు.  ఏ పరిస్థితుల్లో తమ కుటుంబం రాజకీయాల్లోకి రావాల్సి వచ్చిందో ఆయన వివరించారు.

తాను తొలుత నాలుగైదు సినిమాలు చేసి వెళ్లిపోవాలని భావించినట్టు ఆయన చెప్పారు. తనకున్న  బిడియం, సిగ్గును తొలగించుకొనేందుకుగాను విశాఖపట్టణంలో వీధి నాటకాలు ప్రదర్శించినట్టు పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకొన్నారు. నాలుగైదు సినిమాలు చేసి వదిలేసి వెళ్లిపోదామని భావించినట్టు ఆయన గుర్తు చేసుకొన్నారు. 

సమాజంలో  చోటు చేసుకొన్న అవినీతి, అన్యాయాలను ఎదిరించాలనేది తనకు చిన్నప్పుటి నుండే ఉండేదని ఆయన చెప్పారు. పేదలకు న్యాయం చేయాలనే ఉద్దేశ్యంతోనే చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చారని ఆయన చెప్పారు. 

సమాజంలో చోటు చేసుకొన్న అన్యాయాలను తాను ప్రశ్నించేవాడినని ఆయన చెప్పారు.అయితే తాను అడవుల్లోకి వెళ్లిపోతాననే అభిప్రాయంతో  తన సోదరుడు చిరంజీవి తనకు రివాల్వర్‌ను ఇప్పించాడని పవన్ కళ్యాణ్ చెప్పారు.రివాల్వర్‌లో ఆసక్తితో తాను నక్సల్  ఉద్యమం వైపుకు వెళ్లిపోతానని భయంతోనే చిరంజీవి తనకు రివ్వాలర్‌ను ఇప్పించారని ఆయన చెప్పారు. కానీ,రివాల్వర్‌పై ఆసక్తి తనకు లేదని ఆయన చెప్పారు.