ఉత్తరాంధ్రలో జరుగుతున్న వనరుల దోపిడీ దేశం మొత్తానికి తెలియాలన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. మహిళల అక్రమ రవాణాపై కేంద్రం పార్లమెంట్‌లో చెబితే అందరి నోర్లు మూతపడ్డాయని ఆయన పేర్కొన్నారు.
మహిళల అక్రమ రవాణా గురించి మాట్లాడితే తనను తీవ్రంగా విమర్శించారని అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఈ నెల 10 నుంచి విశాఖ లో ప్రారంభమయ్యే మూడో విడత వారాహి యాత్రపై మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో విశాఖ జిల్లా నేతలతో పవన్ గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళల అక్రమ రవాణాపై కేంద్రం పార్లమెంట్‌లో చెబితే అందరి నోర్లు మూతపడ్డాయని ఆయన పేర్కొన్నారు. చిన్నారుల అక్రమ రవాణాలో ఏపీ మూడో స్థానంలో వుండటంపై పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు.
తాను ఏం మాట్లాడినా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని మాట్లాడతానని ఆయన తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థపై తాను చేసిన వ్యాఖ్యలు పెందుర్తిలో నిజమయ్యాయని.. ఓ వృద్ధురాలిని వాలంటీర్ హత్య చేశాడని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ రాజ్ వ్యవస్థను చంపేయడానికే వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారని జనసేనాని ఆరోపించారు. మూడో విడత వారాహి యాత్ర పూర్తయ్యే లోపు విశాఖలో భూ కబ్జాలు ఆగాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. ఉత్తరాంధ్రలో జరుగుతున్న వనరుల దోపిడీ దేశం మొత్తానికి తెలియాలన్నారు. వారాహి యాత్రలో భాగంగా వైసీపీ నేతల చేతుల్లో కబ్జాకు గురైన ప్రాంతాలను పరిశీలిస్తామని పవన్ చెప్పారు.
