సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనసేన పార్టీలో పవన్ కళ్యాణే చంద్రబాబు కోవర్టు అని కామెంట్ చేశారు. వ్యూహం సినిమాకు సెన్సార్ క్లియరెన్స్ వచ్చిన సందర్భంలో ఆ సినిమాకు ప్రచారంలో భాగంగా ఈ వివాదాస్పద ట్వీట్ చేశారా? అనే అనుమానాలు వస్తున్నాయి.
హైదరాబాద్: జనసేన, పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసుకుంటూ ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఆయన తరుచూ పవన్‌ను టార్గెట్ చేస్తుంటారు. తాజాగా మరోసారి ఇలాగే కామెంట్ చేశారు. జనసేన పార్టీని పెట్టిన పవన్ కళ్యాణే ఆ పార్టీలో కోవర్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు కోవర్ట్అని కామెంట్ చేశారు.
జనసేన పార్టీలో చంద్రబాబు కోవర్టు పవన్ కళ్యాణే అని నాకు అనిపిస్తున్నది అంటూ రామ్ గోపాల్ వర్మ పోస్టు చేశారు. వ్యూహం సినిమాకు సెన్సార్ క్లియరెన్స్ వచ్చిన సందర్భంలో ఈ కామెంట్ చేశారు.
నిన్న రాత్రి ఆయన సెన్సార్ క్లియరెన్స్ వచ్చినట్టు ఇదే ఎక్స్‌లో వెల్లడించారు. బ్యాగ్ గాయ్స్‌కు బ్యాడ్ న్యూస్ అంటూ పోస్టు పెట్టి.. వ్యూహం సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ వచ్చిందని, డిసెంబర్ 29వ తేదీన థియేటర్‌లకు వస్తుందని తెలిపారు. ఆ తర్వాత జనవరి 25వ తేదీన దీనికి సీక్వెల్ శపథం కూడా వస్తుందని వివరించారు.
ఈ రోజు ఉదయం ఆయన పవన్ కళ్యాణ్, చంద్రబాబులను ఉద్దేశించి వ్యూహం సినిమా ఫొటో ఒకటి పోస్టు చేశారు. సోఫాలో చంద్రబాబు వేషధారి కూర్చుని ఉంటే పవన్ కళ్యాణ్ పాత్రధారి నిలబడి సాలోచనగా నడుస్తూ ఉన్నారు. మీరేమనుకుంటున్నారు.. వారు మాట్లాడుతున్నారని అనుకుంటున్నారా? అంటూ ప్రశ్న వేశాడు. ఆ ఫొటోలో మాత్రం అంత సీన్ లేదు అని రాసి ఉన్నది.
పవన్ కళ్యాణ్‌ను ఆర్జీవీ కావాలనే టార్గెట్ చేశారా? లేక వ్యూహం సినిమా ప్రచారానికి ఈ కామెంట్ చేశారా? అనే చర్చ జరుగుతున్నది. వ్యూహం సినిమాకు సెన్సార్ రాకుండా బోర్డుకు కొన్ని ఫిర్యాదులు అందిన సంగతి తెలిసిందే.
