అమరావతి: ఐదో తరగతి వరకు విద్యాబోధన మాతృ భాషలోనే జరగాలని నూతన విద్యా విధానంలో నిర్ణయించడాన్ని తమ పార్టీ హర్షధ్వానాలతో స్వాగతిస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు.  ఆంధ్రప్రదేశ్ లో ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ వైసీపీ ప్రభుత్వం నిర్ణయించినప్పుడు జనసేన తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి విదితమేనని ఆయన గుర్తు చేశారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.

"జనసేన ఆంగ్ల మాధ్యమానికి ఏ మాత్రం వ్యతిరేకం కాదు. అయితే తమ పిల్లలు మాతృభాషలోనా లేదా ఆంగ్ల మాధ్యమంలో చదవాలా అనే విషయాన్ని తల్లిదండ్రుల నిర్ణయానికి వదిలేయాలని, ఆంగ్ల మాధ్యమం ఐచ్ఛికంగా మాత్రమే ఉండాలని జనసేన కోరుతూ వస్తోంది" అని అన్నారు. "ఈ నిర్ణయం జనసేన భావావేశంతో తీసుకున్నది కాదు. విద్యారంగంలో అపార అనుభవం ఉన్న నిపుణులతో చర్చలు జరిపిన తరువాత తీసుకున్న ఒక బాధ్యతాయుతమైన నిర్ణయం" అని పవన్ కల్యాణ్ వివరించారు. 

"మాతృ భాషలో బోధన జరిగినప్పుడు గొప్ప ఫలితాలు ఆవిష్కృతమవుతాయని ఐక్యరాజ్య సమితికి అనుబంధమైన యునెస్కో 2008లో ప్రకటించింది. అనేక పరిశోధనలు చేసిన తరువాత యునెస్కో ఈ నిర్ణయానికి వచ్చింది" ఆయన అన్నారు.

"ఈ నేపథ్యంలో సామాజిక బాధ్యతతో జనసేన... బోధన మాధ్యమం ఐచ్ఛికంగా ఉండాలేగాని, తప్పనిసరి కాకూడదు అని కోరుతూ వస్తోంది. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి గాని మన తెలుగు భాష, మన నదుల పరిరక్షణకు 'మన నది - మన నుడి' కార్యక్రమానికి రూపకల్పన చేసి రాజముండ్రిలో మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ సందర్భంగా ప్రారంభించాం" అని అన్నారు. 

"అంతకు ముందు తిరుపతిలో తెలుగు సాహితీ స్రష్టలతో ఒక సమావేశం జరిపినప్పటికీ పూర్తి స్థాయి కార్యక్రమానికి రాజమండ్రి లో అంకురార్పణ చేశాము. జనసేన కోరుకున్నది, నూతన విద్య విధానం కమిటీ ఆలోచన ఒకేలా ఉండడం ఆనందం కలిగించింది. మన సంస్కృతి, సంప్రదాయాలు  పరిఢవిల్లాలంటే మన భాషలు, మన నదులు సజీవంగా సాగిపోవాలి" అని పవన్ కల్యాణ్ అన్నారు. 

"అందువల్ల  తెలుగు భాష, మన నదుల పరిరక్షణను జనసేన ఒక నిరంతర కార్యక్రమంగా స్వీకరించింది. కొవిడ్ మహమ్మారి సద్దుమణిగాక ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకు వెళతామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను" అని పవన్ అన్నారు. 

ప్రాథమిక విద్యాబోధన మాతృభాషలోనే జరగాలని నిర్ణయించిన కమిటీ సభ్యులకు, కమిటీ సిఫార్సులను ఆమోదించిన ప్రధాని నరేంద్ర మోడీ  నాయకత్వంలోని బి.జె.పి. ప్రభుత్వానికి, తెలుగు భాషాభిమానులకు ఆయన కృతజ్ఢతలు తెలిపారు.