మంగళగిరి: వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా మంగళగిరిలో డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు పేరిట ఏర్పాటు చేసిన ఉచిత అన్నదాన శిబిరాన్ని ప్రారంభించిన పవన్ కళ్యాణ్ భవన నిర్మాణ కార్మికులను దిక్కులేని వాళ్లుగా చేసిందని ఆరోపించారు. 

ప్రభుత్వం ఇప్పటి వరకు 50 మంది భవన నిర్మాణ కార్మికులను చంపేసిందని ఆరోపించారు. కత్తులతోనో, ఇతర రకాలుగానో మనుషుల ప్రాణాలు తీయోచ్చునని విన్నాం కానీ తప్పుడు పాలసీలతో కూడా ప్రాణాలు తీయోచ్చని ప్రభుత్వం నిరూపించిందంటూ ఆగ్రమం వ్యక్తం చేశారు. 

సామాన్యుడికి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే తాను జనసేన పార్టీని ఏర్పాటు చేసినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల కడుపు మంట నా గొంతు రూపంలో వచ్చి చల్లార్చాలన్నదే తన నిర్ణయమన్నారు.  

డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు పేరిట భవన నిర్మాణ కార్మికులకు ఆహారం అందించడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఆహారం అందిస్తున్నానంటే వారు దిక్కులేని వారని కాదన్నారు. భవన నిర్మాణ కార్మికులు పడుతున్న బాధలు చూసి తనకు ఏడుపు వచ్చిం ఏం చేయాలో తోచక ఇలా చేశానన్నారు. 

ఒక రాజకీయ పార్టీగా మీ సమస్యలకు తాము అండగా ఉన్నామన్న లక్ష్యంతో డొక్కా సీతమ్మ ఆహార శిబిరాలు ఏర్పాటు చేసినట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసి వారిని ఆత్మహత్యలకు పాల్పడేలా పురిగొల్పితే తాము మాత్రం భవన నిర్మాణ కార్మికులకు అండగా నిలుస్తున్నామన్నారు. 

గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను బట్టబయలు చేసేందుకు వైసీపీ ప్రభుత్వం తప్పుడు పాలసీలను తీసుకువచ్చిందన్నారు. గత ప్రభుత్వం తప్పిదాలను ఎత్తిచూపుతూ 5నెలలుగా ఇసుకను అందుబాటులో లేకుండా చేసిందని ఆరోపించారు. 

తనకు వైయస్ జగన్మోహన్ రెడ్డితో గానీ, చంద్రబాబు నాయుడుతో గానీ ఎలాంటి శత్రుత్వం లేదన్నారు. ప్రజల పక్షాన శత్రువుగా మారాలనుకుంటే మారతానని అందులో తన స్వార్థం ఏమీ ఉండదన్నారు. 

జగన్ రెడ్డి అని పిలిస్తే వైసీపీ నాయకులు భయపడిపోతున్నారని తెలిపారు. వైసీపీకి చెందిన 151 మంది ఎమ్మెల్యేలు జగన్ రెడ్డిని ఏమని పిలవాలో ఒక తీర్మానం చేసుకుని నిర్ణయం తీసుకోవాలని సూచించారు. 

జగన్ అంటే తనకు వ్యక్తిగతంగా ఎలాంటి శత్రుత్వం లేదన్నారు. గత ఐదు నెలలుగా భవన నిర్మాణ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇప్పటి వరకు 50 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. 

ఇప్పటి వరకు వైయస్ జగన్ కు ఇసుక వారోత్సవాలు చేసేందుకు సమయం దొరకలేదా అని నిలదీశారు. ఏనాడైనా సీఎం జగన్ గానీ మంత్రి బొత్స సత్యనారాయణ పస్తులు ఉన్నారా అంటూ మండిపడ్డారు. మీకు ఆకలి బాధలు తెలిసి ఉంటే ఇంతమందిని చంపేవారా అని నిలదీశారు. ఇది చాలా బాధాకరమన్నారు. 

ఏనాడైనా పస్తులు ఉంటే సగటు మనిషి కడుపు మంట తెలిసి ఉండేదని చెప్పుకొచ్చారు. తోటి మనిషి ఆకలితో కడుపు మంటతో చచ్చిపోతుంటే మనకెందుకులే చేతులు కట్టుకుని కూర్చుంటే ఒక్కొక్కడు తలమీదకెక్కి తైతిక్కలాడతారంటూ ధ్వజమెత్తారు. అలాంటి వారిని నేలకేసి కొట్టాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

పవన్‌తో టీడీపీ నేతల భేటీ: జనసేనానికి కేశినేని కంగ్రాట్స్

నీకే నోరు ఉందా.. మాకు లేదా: పవన్‌పై బొత్స సత్యనారాయణ ఫైర్