కాకినాడ: ఏపీలో రాజకీయవేడి రగులుతోంది. ఎన్నికల సమరానికి పార్టీలు సై అంటున్నాయి. అటు అధికార పార్టీ తెలుగుదేశం, ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కో నియోజకవర్గానికి సంబంధించి అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నారు. అటు జనసేన సైతం అభ్యర్థుల ప్రకటనకు సై అంటోంది. 

వాస్తవానికి అసెంబ్లీ ఎన్నికలకు తొలి అభ్యర్థిని ప్రకటించి రికార్డు సృష్టించింది జనసేన పార్టీయే అని చెప్పుకోవాలి. జనసేన తొలి అభ్యర్థిగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన పితాని బాలకృష్ణను పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ముమ్మిడివరం నియోజకవర్గం అభ్యర్థిగా బాలకృష్ణ బరిలోకి దిగనున్నారని అతనికి సహకరించాలని కూడా కోరారు. 

రెండో అభ్యర్థిని కూడా తూర్పుగోదావరి జిల్లా నుంచే ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. పి.గన్నవరం నియోజకవర్గం అభ్యర్థిగా పాముల రాజేశ్వరి దేవిని రెండో అభ్యర్థిగా ప్రకటించాలని జనసేన ఎన్నికల టీం ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

బిసీ వర్గానికి చెందిన పితాని బాలకృష్ణకు టికెట్ ఇచ్చి బీసీలకు జనసేన అండగా ఉంటుందని నిరూపించిన పవన్ కళ్యాణ్ ఈసారి దళితులను టార్గెట్ గా చేసుకున్నారు. రెల్లికులాన్ని దత్తత తీసుకున్నానని ప్రకటించి దళితులకు దగ్గరయ్యే  ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్.

 రెండో అభ్యర్థిగా దళిత సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని ప్రకటించి తాము దళిత పక్షపాతమని చాటిచెప్పాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పి.గన్నవరం అభ్యర్థిగా పాముల రాజేశ్వరి దేవిని ప్రకటించాలని వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. 

పాములు రాజేశ్వరి దేవిని పి.గన్నవరం అభ్యర్థిగా ప్రకటిస్తే జనసేన ప్రకటించిన తొలి మహిళా అభ్యర్థిగా ఆమె రికార్డు సృష్టింనున్నారు. ఇప్పటికే పాముల రాజేశ్వరి దేవికి పరోక్షంగా సంకేతాలిచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. 

గత కొద్దిరోజులుగా పాముల రాజేశ్వరి దేవి  కూడా నియోజకవర్గంలో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గాజు గ్లాస్ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. దీంతో పవన్ నుంచి పాముల రాజేశ్వరి దేవికి గ్రీన్ సిగ్నల్ వచ్చేసినట్లేనని అందువల్లే ఆమె ప్రచారంలో జోరు పెంచారని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు.  

పాముల రాజేశ్వరి దేవి కాంగ్రెస్ పార్టీ హయాంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004 ఎన్నికల్లో నగరం నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. నియోజకవర్గాల పునర్విభజన అనంతరం 2009లో పి.గన్నవరం నుంచి పోటీచేసి విజయం సాధించారు. 

పి.గన్నవరం నియోజకవర్గం నుంచి గెలుపొందిన తొలిఎమ్మెల్యేగా గుర్తింపు  పొందారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉండటంతోపాటు కాస్త ఓటు బ్యాంకు ఉండటంతో ఆమె గెలుపు సునాయాసంగా ఉంటుందని భావిస్తున్నారు. 

పాముల రాజేశ్వరి దేవికి బీసీ, దళిత, కాపు సామాజిక వర్గాల్లో మంచి పట్టు ఉంది. ఇకపోతే పి.గన్నవరం నియోకవర్గంలో ఓటర్ల సంఖ్య లక్షా 72వేల 973 ఓట్లు ఉన్నాయి. వారిలో పురుషులు 87వేల 493 కాగా స్త్రీలు 85వేల 480 మంది ఉన్నారు. 

నియోజకవర్గంలో 70వేల మంది వరకు దళిత ఓటర్లు ఉండగా, కాపు సామాజికవర్గం 45వేల వరకు ఓట్లు ఉన్నాయి. బీసీ ఇతర సామాజిక వర్గాల ఓట్లు 50 వేల ఓట్లు వరకు ఉన్నాయి. రాబోయే ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం ఓట్లు గంపగుత్తగా జనసేనకు పడే అవకాశం ఉంది. 

దళిత, బీసీ, ఇతర సామాజిక వర్గాల్లో పాముల రాజేశ్వరి దేవికి మంచి పట్టుండటంతో ఆమె గెలుపు సునాయాసంగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ తరుపున సిట్టింగ్ ఎమ్మెల్యే పులపర్తి నారాయణ మూర్తి బరిలో ఉంటారా లేక అభ్యర్థిని మారుస్తారా అన్నదానిపై క్లారిటీ లేదు. 

ఇకపోతే వైసీపీ తరుపున కొండేటి చిట్టిబాబు బరిలో దిగనున్నారు. కొండేటి చిట్టిబాబు సైతం గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాని ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో పి.గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ, జనసేనల మధ్యే పోటీ ఉంటుందని తెలుస్తోంది. అదికూడా నువ్వా నేనా అన్నరీతిలో ఉంటుందని ప్రచారం.