పి.గన్నవరం: తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రాన్ని దోచుకుతింటున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్ పి.గన్నవరం బహిరంగ సభలో ప్రసంగించారు. 

మరో ఐదేళ్లు టీడీపీ, జగన్ ఉంటే మాత్రం గోదావరిలో ఇసుక ఉండదని విమర్శించారు. ఆ రెండు పార్టీలు ఇసుక దోపిడీకి పాల్పడుతున్నాయని ఘాటుగా విమర్శించారు. రాష్ట్రంలో వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో టీడీపీని ఇంటికి పంపి, వైసీపీని పక్కన పెడితేనే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. 

మరోవైపు రాజకీయ లబ్ది కోసం కొందరు నాయకులు కులాలు, ప్రాంతాలుగా ప్రజల్ని రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. కులాలు, ప్రాంతాలకు అతీతంగా పాలన రావాలని పవన్ ఆకాంక్షించారు. 

పాతికేళ్ల భవిష్యత్తు కోసమే తాను జనసేన పార్టీని స్థాపించినట్లు పవన్ చెప్పుకొచ్చారు. 2014 ఎన్నికల్లో తాను ఏమీ ఆశించకుండా టీడీపీకి మద్దతు తెలిపానన్నారు. చిన్నప్పటి నుంచి సమాజ శ్రేయస్సే ధ్యేయంగా తాను పెరిగానని, సమాజంలో అవినీతిని చూసి తనకు విసుగొచ్చిందని చెప్పారు. 

ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే రాజకీయాల్లోకి వచ్చినట్టు పవన్ తెలిపారు. వైసీపీ అధినేత జగన్‌కు రాజ్యాంగం అంటే గౌరవంలేదని ధ్వజమెత్తారు. రాజ్యాంగంపై గౌరవం ఉంటే ఆయన అసెంబ్లీకి వెళ్లేవారని ఇలా భయపడి రోడ్లపై తిరిగేవారు కాదన్నారు. మరోవైపు కోనసీమ గ్యాస్‌ నిక్షేపాలను గుజరాత్‌కు తరలిస్తున్నారని ఆరోపించారు. కోనసీమకు జరుగుతున్నఅన్యాయంపై నిలదీసేందుకు తానెవ్వరికీ భయపడనన్నారు.  

ఈ వార్తలు కూడా చదవండి

ఫండ్స్ ఇస్తే లొంగిపోయే పార్టీ జనసేన కాదు:పవన్ కళ్యాణ్