అమలాపురం: 
ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీల వల్ల ప‌చ్చ‌గా ఉండే కోన‌సీమ ప‌ర్యావ‌ర‌ణం దెబ్బ‌ తింటోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. అధికారంలోకి వ‌చ్చాక అంబానీల‌ను రాష్ట్రానికి పిలిపించి కోన‌సీమ‌కు అండ‌గా ఉండాల‌ని మాట్లాడ‌తాన‌ని పవన్ హామీ ఇచ్చారు.

ప్రజాపోరాట యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్ రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. మన ప‌ర్యావ‌ర‌ణాన్ని నాశ‌నం చేస్తూ మన రాష్ట్రానికి రావాల్సిన వాటా ఇవ్వ‌కుండా స‌హ‌జ వ‌న‌రులు దోచుకెళ్ల‌టాన్నిస‌హించ‌బోమ‌ని పవన్ రైతులతో అన్నారు. 

మిగిలిన పార్టీల్లా పార్టీ ఫండ్స్ ఇస్తే లొంగిపోయే పార్టీ జనసేన కాదని ప్రజల సంక్షేమమే ధ్యేయం తప్ప పార్టీ ఫండ్స్ కాదన్నారు. తూర్పుగోదావరి జిల్లా ముఖ్యంగా కోనసీమలో యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా ప్రకృతి వనరులను దోచుకుపోతుంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.  

అంబానీలు దేశాన్ని శాసించే పారిశ్రామికవేత్త‌లే కావ‌చ్చుగానీ త‌నకు ఎలాంటి భ‌యం లేదన్నారు. మ‌ట్టిలో క‌స్తూరి ప‌రిమ‌ళాలు పండించి మ‌న క‌డుపు నింపేవాడే రైతు అని కొనియాడారు. అలాంటి రైతు గిట్టుబాటు ధ‌ర లేక ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డ‌టం, మ‌ద్ద‌తు ధ‌ర‌లేక క‌న్నీరు పెట్ట‌డం చూడ‌లేకే తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చానని పవన్ కళ్యాణ్ తెలిపారు. 

వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి హ‌యాంలో ఎస్.ఈ.జెడ్ ల పేరుతో ప‌చ్చ‌ని పొలాలు దోచుకుని రైతుల‌ను రోడ్డున ప‌డేయ‌డం, చంద్ర‌బాబు హ‌యాంలో బ‌షీర్ బాగ్ లో రైతుల‌పై కాల్పులు జ‌ర‌ప‌డం తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. ఊళ్ల‌ కోసం రోడ్లు వేయ‌డం చూశాంగానీ, రోడ్ల‌ కోసం ఊళ్లు తీసేయ‌డం చూడ‌లేద‌ని ఒక తెలంగాణ రైతు అన్న మాటలు నా హృద‌యాన్ని బ‌లంగా తాకాయన్నారు. 

ప్ర‌కృతిని ప‌రిర‌క్షించే అభివృద్ధి ప్ర‌స్థానం ఉండాలే త‌ప్ప‌ విధ్వంసం సృష్టించే అభివృద్ధి అవ‌స‌రం లేదన్నారు. మ‌న పాల‌కులు ఎంత‌సేపు సింగ‌పూర్ త‌ర‌హా అభివృద్ధి అంటారే త‌ప్ప రైతు సమ‌స్య‌లను ఎందుకు పట్టించుకోవడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. 

రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు నాయకులకు కనబడటం లేదా అని పవన్ నిలదీశారు. సమ‌స్య‌లు చెప్ప‌డానికి  క‌లెక్ట‌ర్, వ్య‌వ‌సాయ అధికారులు ద‌గ్గ‌ర‌కు రైతులు వెళ్తుంటే ప్రభుత్వానికి చెప్పుకో అంటున్నారే తప్ప ఎవరూ సమస్యను పరిష్కరించడం లేదన్నారు. తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక రైతులు సతమతమవుతున్నారని చెప్పుకొచ్చారు. 

అన్నం పెట్టే రైతే ప్రజలకు కనిపించే దేవుడన్నారు. అలాంటి రైతుకు అండ‌గా ఉండ‌క‌పోతే ఎవ‌రికి అండ‌గా ఉంటామన్నారు. రైతుల‌ను ర‌క్షించుకోవ‌డానికి జ‌న‌సేన పార్టీ ఉందని సాటి రైతుగా చెప్తున్నానన్నారు. రైతు స‌మ‌స్య‌ల‌ను అర్థం చేసుకోవ‌డానికే కోన‌సీమలో ప‌ర్య‌టిస్తున్నట్లు తెలిపారు. 

రైతుల‌కు సంపూర్ణంగా ఇన్స్యూరెన్స్ తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఉపాధి హామీ ప‌థ‌కాన్ని రైతుల‌కు అనుసంధానం చేస్తామన్న పవన్ రైతు స‌మ‌స్య‌ల అధ్యయ‌నానికి జ‌న‌వ‌రి లేదా ఫిబ్ర‌వ‌రిలో ప్ర‌త్యేక రైతుల స‌ద‌స్సుల‌ను నిర్వ‌హిస్తామ‌ని చెప్పుకొచ్చారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

ఆ విషయంలో అంబానీని సైతం ఎదిరిస్తా:పవన్ కళ్యాణ్ (వీడియో)