విజయవాడ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనపై కుల ముద్ర వేయాలని చూస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. తనకు కులపిచ్చి ఉంటే టీడీపీకి ఎందుకు మద్దతిచ్చేవాడినని ఆయన అన్నారు. పవన్ సమక్షంలో వైసీపీ, కాంగ్రెస్ నేతలు జనసేనలో చేరారు. 

ఈ సందర్భంగా ఆదివారం ఆయన మాట్లాడారు. ఉద్యోగం మీ అబ్బాయికి ఇస్తే చాలదు రాష్ట్రంలో నిరుద్యోగులకు ఇవ్వాలని, మీ అబ్బాయి సీఎం అయితే ఏం జరుగుతుందో తలచుకుంటే భయమేస్తోందని ఆయన అన్నారు. 

జగన్‌ను ఏం అడిగినా ముఖ్యమంత్రి అయితేనే చేస్తానంటారని, సమస్య పరిష్కరించాలంటే జగన్ ముందు అసెంబ్లీకి రావాలని ఆయన అన్నారు. పంటలు పండించే భూములు మీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ఇవ్వాలా, మూడు పంటలు పండే భూములు రాజధానికి తీసుకోవడమేమిటని ప్రశ్నించారు.
 
జనసేన పార్టీది యునైటెడ్‌ రూల్‌ అని, మిగిలిన పార్టీలది డివైడ్‌ రూల్‌ అని పవన్ కల్యాణ్ అన్నారు. అందుకే జనసేన నినాదంలో కులాల ఐక్యత అని పెట్టాని  చెప్పారు.  రెండు వర్గాల వారు కొట్టుకుంటే.. వారు విడివిడిగా ఉంటే చంద్రబాబుకు ఆనందంగా ఉంటుందా అని ప్రశ్నించారు. 

పవన్‌ బీజేపీని ఏమీ అనడం లేదని సీఎం అంటున్నారని, గతంలో టీడీపీ ని ఏమీ అనకపోయినా బూతులు తిట్టారని ఆయన అన్నారు. తానెప్పుడూ యూటర్న్‌ తీసుకోలేదన్నారని ఆయన అన్నారు. పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు పిలిస్తే ఆయన్ను కలిసేందుకు వెళ్లానని, ఆయన కొన్నిసీట్లు ఇస్తామని చెప్పారని.. ఆ విషయం వెంటనే పేపర్లలో వచ్చేసిందని, అప్పటి నుంచి తనకు నమ్మకం పోయిందని అన్నారు. 

తనకు రాజకీయ అనుభవం లేదంటున్నారు. మీకుందా అని, మీరు రాజకీయాల్లోనే పుట్టారా రాజకీయాల్లోకి రాగానే అనుభవం రాదని ఆయన చంద్రాబబును ఉద్దేశించి అన్నారు.