విజయవాడ: జనసేన పార్టీ సమీక్షా సమావేశంలో ఆపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎందుకు రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది...ఎప్పటి నుంచి రాజకీయాలను గమనిస్తున్నారో అన్న ఇంట్రెస్టింట్ అంశాలను కార్యకర్తలతో పంచుకున్నారు. 

రాష్ట్రంలో తృతియ ప‌క్షం లేని నేపథ్యంలో ఉన్న రెండు రాజ‌కీయ పార్టీలు త‌మ స్వార్ధం కోసం రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసే ప్ర‌మాదం ఉందని అందుల్లే జనసేన పార్టీ ఆవిర్భవించిందన్నారు. ప్ర‌జారాజ్యం పార్టీ పెట్ట‌క ముందే తాను కామ‌న్‌మెన్ ప్రొటెక్ష‌న్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. 

కామన్ మెన్ ప్రోటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు సమయంలో తనతో ఎవ‌రైతే ఉన్నారో వారే జ‌న‌సేన ఆవిర్భావ స‌మ‌యంలో ఉన్నారని చెప్పుకొచ్చారు. 2003లోనే తాను రాజ‌కీయాల్లోకి రావాల‌ని నిర్ణ‌యించుకున్నట్లు చెప్పుకొచ్చారు. ఆనాటి నుంచే ప్ర‌పంచ‌, దేశ‌, రాష్ట్ర స‌మ‌కాలీన రాజ‌కీయ ప‌రిస్థితుల్ని అధ్య‌య‌నం చేస్తూ వ‌చ్చినట్లు పవన్ చెప్పుకొచ్చారు. 

తన రాజ‌కీయ ఆలోచ‌న‌ల‌కి అనుగుణంగానే తన సినిమాలు రూపకల్ప చేశానని చెప్పుకొచ్చారు. దృఢ‌మైన భావ‌జాలంతోనే జ‌న‌సేన‌కు రూప‌క‌ల్ప‌న చేసినట్లు తెలిపారు. తాను వ్య‌వ‌స్థ‌ని బ‌ల‌ప‌ర్చ‌డానికి వ‌చ్చానే త‌ప్ప వ్య‌క్తిగా బ‌ల‌ప‌డ‌డానికి రాలేదన్నారు. 

రాజ‌కీయాల్లో వచ్చింది ప్రజలకు సేవ చెయ్యడానికే తప్ప డ‌బ్బు సంపాదించ‌డానికి కాదన్నారు. స్టార్ డ‌మ్ ఉన్న‌త స్థితిలో ఉన్న స‌మ‌యంలోనే తాను క్రియాశీల‌క రాజ‌కీయాల్లోకి వ‌చ్చేశానన్నారు.

2003 నుంచి డ‌బ్బు ప్ర‌భావిత రాజ‌కీయాలు మ‌న తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోయాయని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి సమయంలో వ్యవస్థను మార్చడానికి ఒక నాయకుడు అవసరమని భావిస్తున్న తరుణంలో తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారన్నారు. 

అయితే ల‌క్ష్య ఛేద‌న‌లో ఆయ‌న ప‌క్క‌న ఉన్న‌వారే ఆయ‌న్ని నిరాశ‌కు గురిచేశారని గుర్తు చేశారు. అలాంటి పరిస్తితి తర్వాత తాను జ‌న‌సేన‌ను స్థాపించి కోట్లాది మంది జ‌నం అభిమానం పొందుతున్నానంటే తానెంత మొండివాణ్ణో అర్ధం చేసుకోవాలన్నారు. కొత్త‌గా పార్టీని స్థాపించడం వల్ల కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. 

అవ‌న్నీ ఊహించే తాను  రాజకీయాల్లోకి అడుగుపెట్టానన్నారు. ఎలాంటి  ఒడిదుడుకుల్ని ఎదుర్కొనే ధైర్యం, స‌త్తా జ‌న‌సేన శ్రేణుల‌కి ఉన్నాయని భావిస్తున్నట్లు తెలిపారు. ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఏ జిల్లాలో చూసినా రాజ‌కీయం కొన్ని కుటుంబాల చేతిలోనే ఉండిపోయిందన్నారు. 

రాజకీయ కుటుంబాలు స్వ‌లాభం కోసం రాజ‌కీయాలు చేస్తూ ప్ర‌జా సంక్షేమాన్ని విస్మరిస్తున్నాయని ఆరోపించారు. రెండు రాజ‌కీయ ప‌క్షాల‌తో ద‌శ‌, దిశ లేకుండా పోతున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు దిశానిర్ధేశం చేయ‌క‌పోతే త‌ప్పు చేసిన వారిమ‌వుతామ‌ని భావించి మూడో ప‌క్షంగా జ‌న‌సేన‌ను స్థాపించినట్లు తెలిపారు. 

వ్య‌వ‌స్థ‌ను రాత్రికి రాత్రే మార్చ‌లేమ‌న్న తనకు తెలుసునని అందుకే ఓర్పు సహనంతో రాజకీయాలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఎంత ఒత్తిడి ఉన్నా భరిస్తున్నట్లు తెలిపారు. అంతేకానీ ఆ ఒత్తిడిని కార్య‌క‌ర్త‌ల మీదకు రుద్దే ప్రయత్నం చెయ్యబోనన్నారు.  

ఈ వార్తలు కూడా చదవండి

యువ శక్తి రాజకీయ శక్తిగా మారాలి, నేను మారుస్తా: పవన్ కళ్యాణ్

రాజకీయాల్లో అలాంటి నాయకుడు ఒక్కరూ లేరు: పవన్ ఆవేదన