ముందే చెప్పారు: కర్ణాటక రాజకీయాలపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyan comments on Karnataka politics
Highlights

 కర్ణాటక తాజా పరిణామాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

విశాఖపట్నం: కర్ణాటక తాజా పరిణామాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ని సీట్లు వచ్చినా బిజెపిదే అధికారమని వాళ్లు తనకు ముందే చెప్పారని ఆయన గురువారంనాడు అన్నారు. బిజెపి అధికారంలోకి వస్తుందని చెప్పారని ఆయన చెప్పారు. 

తమకు 90 సీట్లు వచ్చినా, కుమారస్వామికి నాలుగు సీట్లు వచ్చినా అధికారం మాదేనని బిజెపి వాళ్లు తనకు చెప్పారని ఆయన అన్నారు. వాళ్ల విధానాలు వాళ్లకున్నాయని, ఆ విధానాలేమిటో మీకూ తెలుసునని అన్నారు. 

అది రైటా, రాంగా అంటే ప్రశ్నించేవారు ఎవరూ లేరని, అందరిలో లోపాలున్నాయని ఆయన అన్నారు. దశాబ్దాలుగా ప్రజాస్వామ్యాన్ని నీరు గార్చారని, నేడు కర్ణాటకలో జరుగుతోంది ఓ ఉదాహరణ అని అన్నారు. ఎవరు చేయలేదు.. టీడిపి, వైసీపి హార్స్ ట్రేడింగ్ చేశాయని ఆయన అన్నారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్రిముఖ పోటీ ఉంటుందని చెప్పారు. 

2019 ఎన్నికలకు సిద్ధమవుతుందని, బాధ్యతాయుతంగా వ్యవహరించే పాలన కోసం పనిచేస్తుందని చెప్పారు. ఉత్తరాంధ్రలో ఉద్యమాలకు పుట్టినిల్లు అయిన శ్రీకాకుళం జిల్లా నుంచి పోరాటం ప్రారంభిస్తున్నట్లు పవన్ కల్యాణ్ మీడియా సమావేశంలో చెప్పారు. ఈ నెల 20వ తేదీన ఇచ్చాపురం నుంచి బస్సు యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు 

గంగపూజ నిర్వహించి యాత్రను ప్రారంభిస్తానని, జై ఆంధ్ర ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయినవారికి నివాళులు అర్పిస్తామని చెప్పారు. మొత్తం 17 రోజుల పాటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో పర్యటన ఉంటుంది అన్నారు. 

బస్సు యాత్రలో భాగంగా ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా ప్రతి నియోజకవర్గంలో యువత, విద్యార్థులతో కవాతు నిర్వహిస్తామని, ప్రతి జిల్లా కేంద్రంలో లక్ష మందితో ఈ కవాతు ఉంటుందని ఆయన అన్నారు. 

ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో స్థానికంగా ఉన్న సమస్యలేమిటో తెలుసుకోవడానికి యాత్ర చేపడుతున్నట్లు పవన్ కల్యాణ్ చెప్పారు. కొంత మంది పాలకుల నిర్లక్ష్యానికి కోట్లాది మంది ప్రజలు అవస్థలు పడుతున్నారని అన్నారు. 

పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదని ఆయన విమర్శించారు. ఉత్తరాంధ్ర జిల్లాలు వెనకబడి ఉంట ప్రాంతాల మధ్య విద్వేషాలు పుడుతాయని అన్నారు. జనసేన మ్యానిఫెస్టో కమిటీ కూడా బస్సు యాత్రలో పాల్గొంటుందని చెప్పారు.

తమది ప్రజాయాత్ర అని, కాలినడక కూడా ఉంటుందని అన్నారు. తాను ఎమ్మెల్యేను గానీ మంత్రిని గానీ కానని, సమస్యలను గుర్తించి పరిష్కారం చూపించగలను గానీ తాను తీర్చలేనని అన్నారు. జనసేన అధికారంలోకి వచ్చినప్పుడు సమస్యలను పరిష్కరించగలమని అన్నారు. ప్రత్యేక హోదాను తాను వదిలిపెట్టలేదని చెప్పారు. తాను ఆశించింది జరగలేదని తనకు తెలుసునని అన్నారు.

loader