కాకినాడ: ఏపీ కేబినేట్ విస్తరణపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కేబినేట్ విస్తరణలో భాగంగా సీఎం చంద్రబాబు నాయుడు ఒక గిరిజనుడికి, ఒక మైనార్టీ సామాజికవర్గానికి చెందిన వ్యక్తులకు మంత్రి పదవులు ఇవ్వడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 
 
గిరిజన నేతలు చనిపోతేనే వారి వారసులకు పదవులిస్తారా? ఇన్నాళ్ళు మీకు గిరిజనులు గుర్తు రాలేదా? అని సీఎం చంద్రబాబును పవన్ కళ్యాణ్ నిలదీశారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్యకు టీడీపీయే కారణం అంటూ ఆరోపించారు. 

నాలుగున్నరేళ్లు గుర్తుకు రాని గిరిజనులను తాను ఏదో చేశానని నమ్మించేందుకు శ్రవణ్ కు మంత్రి పదవి ఇచ్చి వారిని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గిరిజనులకు మంత్రి పదవి ఇన్నాళ్లకు గుర్తుకు వచ్చిందా అంటూ మండిపడ్డారు. గిరిజనులకు విద్య వైద్య వంటి మౌళిక సదుపాయాలు కల్పించాలని పవన్ డిమాండ్ చేశారు. 
గిరిజనుల నివసించే అటవీ ప్రాంతాల్లో బాక్సైట మైనింగ్ తవ్వకాలను నిలిపివెయ్యాలని డిమాండ్ చేశారు. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే గిరిజనుల కోసం తూర్పు కనుమల్లో మైనింగ్‌ను నిషేధిస్తామని హామీ ఇచ్చారు. గిరిజనులకు విద్య వైద్య మౌళిక సదుపాయాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. 

చంద్రబాబులా, జగన్ లా తాను గిరిజనులను చిన్నచూపు చూడనని తాను గిరిజన ప్రాంతాల్లో కూడా పర్యటిస్తానని తెలిపారు. గిరిజనులు అధైర్యపడొద్దని జనసేన అండగా ఉందని గుర్తుంచుకోవాలన్నారు. ఒక మంత్రి పదవి ఇచ్చినంత మాత్రాన గిరిజనులంతా తమకే ఉన్నారని చంద్రబాబు భ్రమపడుతున్నారన్నారు. 

మరోవైపు నాలుగున్నరేళ్లుగా ముస్లింలకు అన్యాయం చేసిన చంద్రబాబు ఆరునెలల్లో ఎన్నికలు ఉన్నాయని ఓట్ల కోసం నాలుగు పదవులు ఇచ్చారని విమర్శించారు. నాలుగున్నరేళ్లలో ముస్లింల కోసం ఏర్పాటు చేసిన సత్యార్ కమిటీని ఎందుకు అమలు చెయ్యలేదని నిలదీశారు. కనీసం ఆకమిటీలో ఏమి ఉందో కూడా పరిశీలించలేదన్నారు. 

నాలుగు పదవులు ఇచ్చినంత మాత్రాన ముస్లిం సోదరులు చంద్రబాబు నాయుడును నమ్ముతారనుకుంటే పొరపాటేనన్నారు. తాను అన్నిమతాలను గౌరవిస్తానని తెలిపారు. చంద్రబాబులా షాదీ నజరానా అంటూ ముస్లిం ఆడపడుచులను మభ్యపెట్టనన్నారు. 

ముస్లింలను ఎవరైనా రెండో తరగతి పౌరులుగా చూస్తే అంగీకరించేది లేదన్నారు.రాజ్యాంగంలోని అన్ని హక్కులను ముస్లిం సోదరులకు తప్పకుండా అమలు చేసి తీరుతానని భరోసా ఇచ్చారు పవన్ కళ్యాణ్.  

 

ఈ వార్తలు కూడా చదవండి

కాకినాడ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ (ఫోటోలు)

చంద్రబాబు మళ్లీ అదే తప్పు చేయొద్దు, ఇబ్బంది పడతారు:పవన్ కళ్యాణ్