కాకినాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో చేసిన తప్పు మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో చేయోద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హితవు పలికారు. ప్రజాపోరాట యాత్రలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో పర్యటిస్తున్న పవన్ కళ్యాణ్, చేసిన తప్పు మళ్లీ చేయోద్దు అని కోరారు. 

హైదరాబాద్ లో అన్ని ప్రధాన కంపెనీలు, కేంద్రాలు ఒకే చోట కేంద్రీకరించడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అదే తప్ప మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో చేస్తున్నారని విమర్శించారు. 

రాష్ట్రరాజధాని అమరావతిలో అన్ని కేంద్రాలు అక్కడే నిర్మిస్తే భవిష్యత్ లో తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. ప్రాంతీయ విబేధాలు రావడంతోపాటు జిల్లాల వారీగా ఉద్యమాలు తలెత్తే ప్రమాదం లేకపోలేదన్నారు.   

కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో హార్ట్ కేర్ సెంటర్ లేదని ఆరోపించారు. అలాగే 14 మెడికల్ కళాశాలలు అమరావతి పరిసర ప్రాంతాల్లో పెడితే ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. మెడికల్ కళాశాలలు ఒకే చోట నిర్మించినా ప్రజలను తరలించలేం కాదా అని ప్రశ్నించారు. అన్ని ముఖ్యకేంద్రాలను వికేంద్రీకరించాలని సూచించారు. 

ఇకపోతే విశాఖపట్నంలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను కేంద్రం ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నించిందని దాన్ని తాను అడ్డుకోవడంతో అది ప్రైవేట్ పరం కాకుండా చేశానని గుర్తు చేశారు. 

ఆదాయం తక్కువగా ఉండటంతో నష్టాల బారినపడిన డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం ప్రయత్నించగా ఉద్యోగులు తమను సంప్రదించినట్లు పవన్ తెలిపారు. తాను కేంద్రప్రభుత్వంతో మాట్లాడానని వామపక్ష పార్టీలతో కలిసి ఉద్యమాలు చేశానని గుర్తు చేశారు. ఫలితంగా కంపెనీ ప్రవేట్ పరంకాకుండా ఆపగలిగామని చెప్పారు. 

ఇకపోతే కాకినాడ సీపోర్ట్ ను నిర్వహిస్తున్న కేవీ రావు అనే వ్యక్తి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడని పవన్ కళ్యాణ్ ఆరోపించారు. ఇష్టానుసారంగా సీపోర్టును దోచుకుంటున్నారని మండిపడ్డారు. మత్స్య సంపదమీద ఆధారపడే మత్స్యకారుల జీవితాలపై దెబ్బకొడుతున్నారన్నారు. 

కేవీ రావు కాకినాడ సీపోర్ట్ ను నిర్వహిస్తారు కానీ ఎలాంటి ట్యాక్స్ లు కానీ పన్నులు కానీ కట్టరన్నారు. స్థానికులకు సైతం ఉద్యోగాలు ఇవ్వరని ఆరోపించారు. ఇవ్వకపోగా మత్స్యకారులకు చెందిన తీరాన్ని కూడా ఆక్రమించి దోచుకుంటున్నారని మండిపడ్డారు. బంగాళాఖాతం, గోదావరి తీరంల కలయిక వల్ల ఏర్పడ్డ సంగమం హోప్ ఐలాండ్ ను ధ్వంసం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

హోప్ ఐలాండ్ చుట్టూ ఉన్న ఇసుక మేటలను ఇష్టం వచ్చినట్లు తవ్వేశారని ఆరోపించారు. మైనింగ్ శాఖ సైతం కేవీరావు అక్రమంగా ఇసుక తవ్వేశారని అందుకు గాను రూ.6కోట్లు పెనాల్టీ విధించినట్లు తెలిపారు. అయితే దానిపై ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. బెర్త్ నంబర్ 567 నిర్మాణానికి ఇసుకను ఇష్టం వచ్చినట్లు తవ్వేశారని అందుకు ఆధారాలు తన దగ్గర ఉన్నాయంటూ లోకేష్ కు సవాల్ విసిరారు.  

 కేవీరావును సీఎం చంద్రబాబు నాయుడు లేదా మంత్రి లోకేష్ లేదా గత కాంగ్రెస్ నేతలు కాపాడవచ్చేమో కానీ జనసేన మాత్రం విడిచిపెట్టదన్నారు. కేవీరావును కాకినాడకు తీసుకువచ్చి ప్రజాకోర్టులో నిలదీస్తామన్నారు. కేవీరావు చేసిన తప్పులకు ఫైన్ కట్టిస్తామన్నారు.   

భూములను పరిరక్షించాల్సిన ప్రభుత్వాలు సెజ్ ల పేరుతో ప్రజల దగ్గర భూములు లాక్కుని ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెడుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ఎకరం స్థలం మీద ఒక కుటుంబం బ్రతుకుతుందని పవన్ తెలిపారు. అలాంటి భూములను కేవీరావు తన భూములుగా రిజిస్ట్ర్ చేయించుకుంటున్నారని ఆరోపించారు.  

ఇలా అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయమే జరుగుతుందని నిలదీయాల్సిన ఎంపీలు ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదన్నారు. వారికి నిత్యం డబ్బు సంపాదనమీదే ధ్యాస అన్నారు. ప్రజలకు, యువతకు తీరని అన్యాయం జరుగుతున్నా పట్టించుకోరా అంటూ నిలదీశారు.  

మరోవైపు పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్నంతసేపు మహిళలు అభిమానులు సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. అభిమానుల నినాదాలపై పవన్ స్పందించారు. సీఎం సీఎం అంటూ మీరు మంత్రంలా జపిస్తున్నారని మీ ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా సీఎం అవుతానన్నారు. మీ దీవెనలే తనను సీఎం చేస్తుందన్నారు. 

తనను సీఎం చేస్తే ఎంత కష్టమైనా భరిస్తానని ప్రజలకు మాత్రం మంచి సేవ చేస్తానన్నారు. అంతేకానీ సీఎంలా, ప్రతిపక్ష నేత చంద్రబాబులా తప్పించుకోనని తడబడ్డారు. అయితే వెంటనే సవరించుకున్న పవన్ కళ్యాణ్ భవిష్యత్ లో చంద్రబాబు ప్రతిపక్ష నేత అవుతారని సందేహం వేస్తుందని చెప్పుకొచ్చారు.