అనంతపురం: తాడిపత్రి ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. జేసీ ప్రభాకర్ రెడ్డి రౌడీయిజం చేస్తున్నారని ఆరోపించారు. అనంతపురం జిల్లాలో కరువుపై జనసేన చేపట్టిన కవాతు కార్యక్రమంలో పాల్గొన్న పవన్ సప్తగిరి సర్కిల్ వద్ద జరిగిన బహిరంగ సభలో జేసీపై మండిపడ్డారు. అధికారులపై దాడులు చెయ్యడం, ప్రజలను భయభ్రాంతులకు గురి చెయ్యడం జేసీకి తగదన్నారు. జేసీ ఫ్యాక్షన్ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు

తనకు కుటుంబ వ్యామోహం లేదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అన్న చిరంజీవిని కూడా వదిలేశానని చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో తన అన్నను కాదని ఏమీ ఆశించకుండా టీడీపీకి మద్దతు ఇచ్చానని పవన్ చెప్పారు. 

అమరావతిలో బలవంతపు భూసేకరణ చేయనని చంద్రబాబు తనకు మాట ఇచ్చారని ఇచ్చినట్టే ఇచ్చి మాట తప్పారంటూ పవన్ ఆరోపించారు. చంద్రబాబు పాలన అంతా అవినీతిమయం అని, ఒక్కో నియోజకవర్గంలో టీడీపీ నేతలు రూ.1000 నుంచి రూ.3500 కోట్లు దోపిడీ చేశారని ధ్వజమెత్తారు. పంచాయతీకి పోటీ చేయలేని నారా లోకేష్‌ పంచాయతీ రాజ్‌శాఖకు మంత్రికావడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

ఆంధ్రులు దోపిడీ దారులంటూ తెలంగాణ నేతలే రాష్ట్రాన్ని చీల్చారని వ్యాఖ్యానించారు. తనకు సీఎం కావాలన్న ఆశ లేదని పవన్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌ నుంచి చంద్రబాబు పారిపోయి వచ్చారని, పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ ఉన్నా స్వప్రయోజనాల కోసం అమరావతి రావడం దురదృష్టకరమన్నారు. 

తాను బీజేపీకి మద్ధతు ఇస్తున్నానంటూ చంద్రబాబు అనవసరంగా విమర్శిస్తున్నారని పవన్‌ మండిపడ్డారు. మోదీ అంటే నాకేం భయం లేదని తేల్చి చెప్పారు. దమ్ముంటే మోదీని నాపై కేసులు పెట్టమనండి, సంగతి తేలుస్తా అంటూ పవన్‌ సవాల్‌ విసిరారు.  

కరువు నివారణలో టీడీపీ సర్కార్‌ పూర్తిగా విఫలమైందని పవన్ ఆరోపించారు. లోకేష్‌ అవినీతిపై ఆధారాలను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తే చంద్రబాబు కనీసం స్పందించ లేదని విమర్శించారు. పోలీసులు ప్రభుత్వం చేతిలో ఆయుధంగా మారిపోయారని విమర్శించారు. 

తెలుగుదేశం పార్టీ నేతలు తనను  హింసించారని, వచ్చే ఎన్నికల్లో టీడీపీ సర్కార్‌ను కూలదోస్తామని పవన్ హెచ్చరించారు. చంద్రబాబు ధృతరాష్ట్రుడిలా తయారయ్యారని, ఏపీలో దుశ్శాసనపర్వం జరుగుతోందని పవన్ ఆవేశపూరితంగా  వ్యాఖ్యానించారు.