Asianet News TeluguAsianet News Telugu

టార్గెట్ 2019: మహా కూటమి సీఎం అభ్యర్ధిగా పవన్ కళ్యాణ్

బాబు, జగన్‌కు వపన్ చెక్ పెట్టేనా?

Pawan Kalyan as CM Candidate from Mahakutami in 2019 elections says Ramakrishna

కర్నూల్: ఏపీలో వచ్చే ఎన్నికల్లో అధికార, విపక్షాలకు వ్యతిరేకంగా లెఫ్ట్‌, జనసేనలు మూడో కూటమి  ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నాయి.ఇప్పటి నుండే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నాయి. మహాకూటమిని ఏర్పాటు చేసి పవన్‌కళ్యాణ్‌ను సీఎం అభ్యర్ధిగా ప్రకటించాలని భావిస్తున్నాయి.ఈ మూడు పార్టీలతో పాటు భావసారూప్యత గల పార్టీలతో మహాకూటమిని ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలను ప్రారంభించాయి.

ఏపీ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి సుమారు 12 శాతం ఓట్లు ఉన్నాయి.తూర్పు. పశ్చిమగోదావరి జిల్లాలో కాపు సామాజికవర్గం ఓటర్లు గెలుపు, ఓటములపై తీవ్రమైన ప్రభావాన్ని చూపనున్నారు.. ఇతర జిల్లాల్లో కూడ కొన్ని నియోజకవర్గాల్లో కాపు ఓటర్లు కీలకంగా ఉన్నారు.

అయితే ఇప్పటికే లెఫ్ట్ పార్టీలు, జనసేన కలిసి పోటీ చేయాలని నిర్ణయం తీసుకొన్నాయి. అయితే ఇంకా కొన్ని పార్టీలను కలుపుకొని  మహాకూటమిని ఏర్పాటు చేయాలని లెఫ్ట్‌పార్టీలు భావిస్తున్నాయి. ఈ విషయమై భావసారూప్యత గల పార్టీలతో చర్చలు చేస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో మహా కూటమి ఏర్పాటైతే... ఆ కూటమి అభ్యర్దిగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌ ఉంటారని సీపీఐ ఏపీ రాష్ట్ర సమితి కార్యదర్శి రామకృష్ణ తాజాగా ప్రకటించారు. 

సినీ నటుడుగా ఉన్న పవన్ కళ్యాణ్ కు ప్రజల్లో ఉన్న క్రేజ్ ఈ కూటమికి కలిసి వచ్చే అవకాశం ఉందని లెఫ్ట్ పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. పవన్‌ కళ్యాణ్‌కు ఉన్న క్లీన్ ఇమేజ్ కూడ కలిసి వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీలు భావిస్తున్నాయి. 

అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున రాష్ట్రంలో పలు సమస్యలపై పోరాటాలు చేయాలని ఈ పార్టీలు భావిస్తున్నాయి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ యాత్రల ద్వారా ప్రజలను కలుసుకొంటున్నారు. ఈ మూడు పార్టీలు సంయుక్తంగా అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున బహిరంగసభను ఏర్పాటు చేయాలని కూడ గతంలో నిర్ణయం తీసుకొన్నాయి.కానీ, పవన్ యాత్ర కారణంగా ఈ సభ జరగలేదు. త్వరలోనే ఈ సభలపై పార్టీ నేతలు నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం లేకపోలేదు.

ఇప్పటికే టీడీపీపై జనసేన చీఫ్ పవన్‌కళ్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ నేతలు కొంత జనసేనకు సానుకూలంగా మాట్లాడుతున్న తరుణంలో లెఫ్ట్ పార్టీలు, జనసేనతో కలిసి పోటీ చేస్తాయని చేసిన ప్రకటన ఏపీ రాజకీయాల్లో చర్చకు తెరతీసింది.

మహాకూటమిలో లోక్‌సత్తాను కూడ కలుపుకోవాలనే ఆలోచనను చేస్తున్నారు. అయితే ఇంకా ఏ పార్టీలు తమతో కలిసివస్తాయనే విషయమై కూడ లెఫ్ట్ పార్టీలు దృష్టిసారిస్తున్నాయి. ఈ కూటమి ఏ మేరకు రాజకీయంగా ఈ మూడు పార్టీలకు ప్రయోజనం కల్గిస్తోందనే విషయాన్ని ఇప్పటికిప్పుడు చెప్పలేం.

Follow Us:
Download App:
  • android
  • ios