ఒంటరిగా పోటీ చేస్తే కోస్తా జిల్లాల్లోని కాపులైనా, రాయలసీమలోని బలిజలైనా, ఉత్తరాంధ్రలోని కాపులైనా పవన్ చెప్పేదానికి ఓకే అంటారు. అయితే, టిడిపి, వైసీపీల్లో ఏదో ఒకదానికి మద్దతుగా నిలవాలని పవన్ అనుకుంటే మాత్రం కోస్తా, రాయలసీమల్లో పవన్ తో నేతలు విభేదించే అవకాశాలే ఎక్కువని కాపు నేతలంటున్నారు.
సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు పెద్ద సంకటమే వచ్చింది. రాబోయే ఎన్నికల్లో పవన్ ఏ పార్టీవైపు వెళ్ళాలనే విషయంలో తీవ్ర సంకటంలో కొట్టుకుంటున్నారు. అంటే వచ్చే ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేస్తుందని పవన్ చెప్పినా చాలామంది నమ్మటం లేదు. అందుకనే ఏదో ఒక పార్టీతో పొత్తు తప్పదనే అనుమానిస్తున్నారు
ఈ నేపధ్యంలోనే వైసీపీకి మద్దతు ఇస్తే ఉపయోగంగా ఉంటుందని కోస్తాలో కాపులు పవన్ పై గట్టిగా ఒత్తిడి తెస్తున్నారుట. ఎందుకంటే, కోస్తా కాపుల్లో అత్యధికులు కమ్మ సామాజికవర్గానికి వ్యతిరేకం. అదే విధంగా టిడిపితోనే కలిసి ఉండాలంటూ రాయలసీమకు చెందిన బలిజనేతలు కొందరు పవన్ కు గట్టిగా చెబుతున్నారట. ఎందుకంటే, ఈ ప్రాంతంలోని బలిజనేతలు రెడ్లను వ్యతిరేకిస్తున్నారు. ఈ పరిస్ధితిల్లో ఎవరితో వెళితే ఏ సమస్య వస్తుందో పవన్ కు అర్ధం కావటం లేదు.
ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే విషయంలోనే రెండు ప్రాంతాల నేతల్లో ఇపుడే ఇంత వైరుధ్యముంటే ఇక ఎన్నికలు సమీపిస్తే పరిస్ధితేంటన్నది పవన్ సమస్య. దీనికి అదనంగా ఉత్తరాంధ్ర ఉండనేఉంది. అక్కడి నేతలు ఇంకా స్పీడ్ కాలేదు. ఎందుకంటే, ఎన్నికలకు ఇంకా చాలా కాలం ఉందికదా అని వారు అనుకుంటున్నారట. రాయలసీమలోని బలిజ నేతలు మాత్రం మంచి దూకుడుమీదున్నారట. ఎందుకంటే, నంద్యాల ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకుని. కాబట్టే పవన్ కు తక్షణ సమస్య వచ్చింది.
నంద్యాలలో జనసేన పోటీ చేసే అవకాశం తక్కువని పవన్ కు బాగా సన్నిహితంగా ఉండే కాపు నేతలంటున్నారు. కాకపోతే అంతర్లీనంగా ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయంలో సమయం వచ్చినపుడు పవనేమన్నా సంకేతాలు పంపుతారేమో అన్న అనుమానాన్ని వ్యక్తం చేసారు. మొత్తం మీద ఒంటరిగా పోటీ చేస్తే కోస్తా జిల్లాల్లోని కాపులైనా, రాయలసీమలోని బలిజలైనా, ఉత్తరాంధ్రలోని కాపులైనా పవన్ చెప్పేదానికి ఓకే అంటారు. అయితే, టిడిపి, వైసీపీల్లో ఏదో ఒకదానికి మద్దతుగా నిలవాలని పవన్ అనుకుంటే మాత్రం కోస్తా, రాయలసీమల్లో పవన్ తో నేతలు విభేదించే అవకాశాలే ఎక్కువని కాపు నేతలంటున్నారు.
