పవన్ వెతుకుతున్నట్లు తుపాకీకైనా గుండెను ఎదురుచూపగలిగినంత ధైర్యం కలిగిన నేతలు ఎప్పుడు దొరుకుతారో ఏమిటో?
చూస్తుంటే పవన్ కల్యాన్ 2019 ఎన్నికలపై సీరియస్ గానే ఉన్నట్లు కనబడుతోంది. ఇప్పటి నుండే ప్రజాసమస్యలను అధ్యయనం చేస్తున్నట్లే కనబడుతోంది. అందుకనే వచ్చే ఎన్నికల్లో మ్యానిఫెస్టోలో పొందుపరిచేందుకు సమస్యలు చెప్పమంటూ అభిమానులను పవన్ కల్యాణ్ కోరారు. చేనేత గర్జన సంరద్భంగా గుంటూరులో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, మార్చి 14వ తేదీన ‘జనసేన వెబ్ సైట్’ ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అప్పటికి జనసేన పెట్టి మూడేళ్ళవుతుందట. ప్రజలు వెబ్ సైట్ ద్వారా తమ సమస్యలను తెలపాలన్నారు.
ప్రజాసమస్యలపై గట్టిగా పోరాడే గట్టి నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. తనకు ప్రత్యేకించి ధనం ఉన్నవాళ్లతో అవసరం లేదని కావాల్సినంత అభిమానధనం ఉందన్నారు. తన అభిమానులు, యువశక్తి నుండే కొత్త నేతలను జనసేన వెతుక్కుంటుందని పవన్ పేర్కొన్నారు. వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకం కాదన్నారు. కాకపోతే వారసత్వం హోదాలో పదవులు అందుకుంటానంటే మాత్రం అంగీకరిచనని చెప్పారు. చిత్తశుద్ది లేకపోతే తన పార్టీలోని నాయకులను కూడా ఎదిరిస్తానని స్పష్టం చేసారు.
వచ్చే ఎన్నికల్లో జనసేన పోటీ చేస్తుందని మరోసారి చెప్పారు. చేనేతల గొంతులు అసెంబ్లీలో వినిపించేలా పోరాటం చేస్తామన్నారు. హోలు మొత్తం మీద చెప్పిందేమంటే, తన పార్టీకి దమ్మున్న నేతలు కావాలన్నారు. అభిమానులున్నంత వరకూ కొత్తగా జనసేనను నిర్మించాల్సిన అవసరం లేదన్నారు. తనకు ప్రజలే బలమని, ప్రజలే ముఖ్యమని పవన్ కల్యాణ్ చెప్పటం గమనార్హం. మరి, పవన్ వెతుకుతున్నట్లు తుపాకీకైనా గుండెను ఎదురుచూపగలిగినంత ధైర్యం కలిగిన నేతలు ఎప్పుడు దొరుకుతారో ఏమిటో?
