ఎన్నికలకు ముందు రెండు పార్టీలు ఇచ్చిన మాటను తప్పినపుడు ఆ ప్రభుత్వాలను ప్రజలు మాత్రం ఎలా నమ్ముతారంటూ పవన్ సూటిగా ప్రశ్నించారు.

రాష్ట్రంలో చేనేత రంగం అభివృద్ధికి సినీనటుడు పవన్ కల్యాణ్ చేయూత నివ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే ఫిబ్రవరి నెలలో మంగళగిరిలో జరుగనున్న చేనేత సదస్సుకు ముఖ్యఅతిధిగా పాల్గొనేందుకు పవన్ అంగీకరించారు. సదస్సులో ముఖ్య అతిధిగా పాల్గొనాల్సిందిగా హాజరుకమ్మని ఆహ్వానించేందకు మంగళగిరి నుండి ప్రత్యేకంగా చేనేతరంగానికి చెందిన ప్రముఖులు పవన్ను కలిసారు. ఆ సందర్భంగా పవన్ వారితో మాట్లాడారు. చేనేతను బ్రతికించుకోవాల్సిన అవసరం అందరిపైనా ఉందన్నారు. తర్వాత అక్కడే ఉన్న మీడియాతో కూడా మాట్లాడారు. 

ఇచ్చిన మాటను పార్టీలు మార్చేస్తున్నపుడు ప్రభుత్వాలను మాత్రం ప్రజలు ఎందుకునమ్మాలంటూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సూటిగా ప్రశ్నించారు. నిజమే కదా? ప్రత్యేకహోదాపై మీడియాతో మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు ఏపికి ప్రత్యేకహోదా ఇస్తామని భాజపా చెప్పింది. టిడిపి కూడా డిమాండ్ చేసింది. కానీ అదికారంలోకి వచ్చిన తర్వాత రెండు పార్టీలు మాట మార్చేసినట్లు పవన్ చెప్పారు. ఎన్నికలకు ముందు రెండు పార్టీలు ఇచ్చిన మాటను తప్పినపుడు ఆ ప్రభుత్వాలను ప్రజలు మాత్రం ఎలా నమ్ముతారంటూ పవన్ సూటిగా ప్రశ్నించారు.

ఎన్నికలకు ముందు తాము ఇస్తానన్న ప్రత్యేకహోదా అధికారంలోకి వచ్చిన తర్వాత సాధ్యం కావట లేదని పార్టీలు వాటికవే అనేసుకుంటే సరిపోతుందా అని సందేహం వ్యక్తం చేసారు. అటువంటి పార్టీలు చేసే చట్టాలని తామెందుకు పాటించాలని ప్రజల ప్రశ్నిస్తే పాలకులే సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే ప్రజలు కూడా మొండితనం చూపించాలని సూచించారు.

ట్వట్టర్లో మాత్రమే తాను స్పందిస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపైన కూడా పవన్ స్పందించారు. కనీసం తాను ట్విట్టర్లోనైనా స్పందిస్తున్నానని, అయితే, మన ఎంపిలు పార్లమెంట్ లో అసలు మాట్లాడటం కూడా లేదు కదా అంటూ ఎద్దేవా చేసారు. మాటలు మార్చే పార్టీలపై ప్రజలకు నమ్మకం ఉండదన్నారు. తాను ప్రజాపక్షమే గానీ ఏ రాజకీయ పార్టీ పక్షమూ కాదని స్పష్టంగా చెప్పారు. ప్రతిపక్షాలతో కలిసి పని చేసే విషయమై మరింత స్పష్టత రావాలని చెప్పటం గమనార్హం.