తెలుగు రాష్ట్రాల మీద పవన్ విసుర్లు. పెట్టుబడుల కోసమంటూ విదేశీ కార్పొరేట్ కంపెనీల మీద చూపించే శ్రద్ధ దేశానికి అన్నం పెట్టే రైతన్నలమీద చూపకపోవడం వల్లే రైతులు రోడ్డెక్క వలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
పెట్టుబడుల మీద తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చూపిస్తున్న శ్రద్ధ మీద జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యతిరేకత చూపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
తెలుగు రాష్ట్రాలలో మిర్చి రైతులు పడుతున్న కష్టాల మీద సానుభూతి వ్యక్తం చేసినా, విదేశీ పెట్టుబడుల ప్రస్తావన తెచ్చినా, తాను విడుదల చేసిన ప్రకటనలో ఎక్కడా విదేశీ పెట్టుబడుల కోసం దేశాలన్నీ తిరుగుతున్న ముఖ్యమంత్రుల పేర్లు లేకుండా జాగ్రత్త పడ్డారు.
ఇపుడు తాజాగా, ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధిపరిచేందుకు అవసరమైన విదేశీ పెట్టుబడులకోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మే 4 నుంచి 11వరకు అమెరికాలో పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రితోపాటు ఇద్దరు మంత్రులు, మరికొంతమంది అధికారులు కూడా ఉంటారు.ప్రవాస భారతీయులు, విదేశాంధ్రులు, ఇతర తెలుగువాళ్ళను ముఖ్యమంత్రి కలుసుకుని పెట్టుబడులు పెట్టాలని కోరతారు.అలాగే అమెరికా పారిశ్రామికవేత్తలతో కూడా ఆయన సమావేశమవుతారు.యుఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ యాన్యువల్ వెస్ట్‌కోస్ట్ సమ్మిట్ 2017లో ముఖ్యమంత్రి పాల్గొంటారు.
ఈ పర్యటన ప్రస్తావనే లేదు జనసేన అధ్యక్షుడి ప్రకటనలో . దీనితో ప్రకటన పేలవంగా తయారయింది.
పవన్ ప్రకటన ఇది:
పెట్టుబడుల కోసమంటూ విదేశీ కార్పొరేట్ కంపెనీల మీద చూపించే శ్రద్ధ దేశానికి అన్నం పెట్టే రైతన్నలమీద చూపకపోవడం వల్లే రైతులు రోడ్డెక్క వలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
ఇందుకు ఉదాహరణ తెలుగు రాష్ట్రాలలో మిర్చి రైతులఆందోళన. ఆరుగాలం కష్టించి పడించే రైతు కన్నీరు పెట్టడం దేశానికి శ్రేయస్కరం కాదు.
ఈ సీజన్లో మిర్చి పంట ఎంత విస్తీర్ణంలో ఎంత వేయాలో రైతులకు ముందుగా తెలియచేయడంలో వ్యవసాయ శాఖ విఫలమయితే, పండిన పంటకు గిట్టు బాటు ధర లభించేటట్లు చేయలేక పోవడం మార్కెటింగ్ శాఖ వైఫల్యంగతా జనసేన భావిస్తున్నది.
ఇప్పటికైనా ప్రభుత్వాలు రైతులు,రైతు సమస్యలపై చిన్నచూపు మాని, రైతుల కోసం క్రియాశీలంగా పనిచేయాలని జనసేన కోరుతున్నది. గత డాది క్వింటాల్ మిర్చికి రు.13500 ధరపలికినందున ఇపుడు కనీసం రు.11000 రైతుకు గిట్టుబాటు ధర ఇవ్వాలి.మార్కెట్లో ధరకి గిట్టుబాట ధరకి మధ్య ఉన్నవ్యత్యాసాన్ని ప్రభుత్వం చెల్లించాలని జనసేన డిమాండ్ చేస్తున్నది.
ఈ ప్రకటన పవన్ కల్యాణ్ సంతకంతో విడుదలయింది.
