అమరావతి: ఏపీ శాసనమండలి  సెలెక్ట్ కమిటీలో ఉండాల్సిన సభ్యుల పేర్లను ఇవ్వాలని ఆయా  పార్టీలకు శాసనమండలి ఛైర్మెన్ షరీఫ్ లేఖ రాశారు. అయితే ఈ లేఖలను శాసనమండలి సెక్రటరీ పార్టీలకు పంపకపోవడం ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది.ఏపీ శాసనమండలి ఛైర్మెన్ సెలెక్ట్ కమిటీలో ఎవరెవరు సభ్యులు ఉండాలనే విషయమై  శాసనమండలి ఛైర్మెన్  ఎంఏ షరీఫ్ పార్టీలకు లేఖ రాశారు. 

Also read:సెలక్ట్ కమిటీ ఏర్పాటులో ట్విస్ట్: వైసీపీ కొత్త వాదన

ప్రతి కమిటీలో తొమ్మిదిమంది సభ్యులు ఉంటారు. శాసన మండలిలో ఉన్న పార్టీల బలానికి అనుగుణంగా సెలెక్ట్ కమిటీలో సభ్యులు ఉంటారు. ఈ లెక్కన టీడీపీకి సెలెక్ట్ కమిటీలో టీడీపీకి ఐదుగురు,  వైసీపీ, బీజేపీ, పీడీఎఫ్ సభ్యులకు ఒక్కొక్క సభ్యుడు ఉంటారు.  ప్రతి కమిటీకి  మండలిలో బిల్లును ప్రవేశపెట్టిన మంత్రి ఛైర్మెన్‌గా ఉంటారు. 

సెలెక్ట్ కమిటీ కోసం పేర్లను ఇవ్వాలని  శాసనమండలి ఛైర్మెన్ ఎంఏ షరీఫ్ శాసనమండలిలో ఉన్న పార్టీలకు లేఖలు రాశారు. అయితే ఈ లేఖలు ఆయ పార్టీలకు చేరలేదు. శాసనమండలి ఛైర్మెన్ ఆదేశించినా సెక్రటరీ పనిచేయకపోతే సభా హక్కుల ఉల్లంఘనే అవుతోందని  టీడీపీ సభ్యుడు యనమల రామకృష్ణుడు చెప్పారు.

యనమల రామకృష్ణుడు ఈ మేరకు గురువారం నాడు  ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. శాసనమండలి ఛైర్మెన్ ఆదేశాలను సెక్రటరీ పాటించాల్సిందేనని ఆయన గుర్తు చేశారు. శాసనమండలి సెక్రటరీని ప్రభుత్వం బెదిరించిందని టీడీపీ ఆరోపిస్తోంది.

Also Read:ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా వైజాగే బెస్ట్.. కానీ ఇబ్బందులు కూడా: జీఎన్ రావు

ఇదిలా ఉంటే టీడీపీ ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు కామెంట్స్‌కు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. శాసనమండలి సెక్రటరీ బెదిరించాల్సిన అవసరం తమకు లేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.

అధికారులు నిబంధనలు, జీవోలు, చట్టాలకు అనుగుణంగా పనిచేస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు. నివేదికలను వక్రీకరించడం టీడీపీకి అలవాటేనని బొత్స సత్యనారాయణ విమర్శించారు.  శాసనమండలిని యనమల రామకృష్ణుడు టీడీపీ కార్యాలయంగా మార్చాడని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు.