వైజాగ్ అనేది అనువైన ప్రదేశమే.. కానీ ఇబ్బందులు కూడ ఉన్నాయన్నారు రిటైర్ ఐఏఎస్ అధికారి జీఎన్ రావు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా విశాఖను ఉద్దేశిస్తూ వార్తాపత్రికల్లో కథనాలు వచ్చిన నేపథ్యంలో జీఎన్ రావు మీడియా ముందుకు వచ్చారు.

ఆంధ్రప్రదేశ్‌లో సమర్థవంతమైన పాలన అందించేందుకు గాను రాష్ట్రాన్ని నాలుగు జోన్లుగా విభజించాలని సిఫారసు చేశామని ఆయన వెల్లడించారు. వివిధ నగరాల అభివృద్ధికి సంబంధించి అధ్యయనం చేశామని, అలాగే వాటి అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలను సూచించామని జీఎన్ రావు తెలిపారు.

Also Read:వద్దంటే మంగళగిరి వెళ్లావు: నారా లోకేష్ పై వల్లభనేని వంశీ ఘాటు వ్యాఖ్యలు

దీనిలో భాగంగానే విశాఖ మెట్రోపాలిటిన్ రీజియన్‌లో చేపట్టాల్సిన అభివృద్ధి గురించే తాము చెప్పామని ఆయన గుర్తుచేశారు. అలాగే ఆయా నగరాల అభివృద్ధికి గల అడ్డంకుల్ని కూడా పరిశీలించామని, అభివృద్ధి వికేంద్రీకరణతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని జీఎన్ రావు అభిప్రాయపడ్డారు.

వివిధ ప్రాంతాలకు చెందిన నిపుణులతో అధ్యయనం చేయించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామని జీఎన్ రావు పేర్కొన్నారు. విశాఖపట్నంలో సముద్ర తీరానికి దూరంగా అభివృద్ధి చేయాలని సూచించామన్నారు.  

కమిటీ లో ఉన్న వాళ్లంతా 40,50 ఏళ్ల అనుభవం ఉన్న వాళ్లేనని, వారంతా ఢిల్లీ,మద్రాస్, బెంగుళూర్ నుండి వచ్చినవారేనని జీఎన్ రావు తెలిపారు. . తుఫాన్లు గురించి కూడా ఆలోచించామని, ఇవన్నీ దృష్టిలో ఉంచుకుని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ నిర్మించుకోవచ్చునని రిపోర్ట్ ఇచ్చినట్లు జీఎన్ రావు వెల్లడించారు.

Also Read:నిపుణుల సలహాలు తీసుకున్నాం.. వ్యాపారస్థులవి కాదు: బాబుపై బొత్స సెటైర్లు

తనపై ఎలాంటి ఒత్తిడి లేదని, స్వచ్ఛందంగా ఈ కమిటీ అధ్యయనం చేసి రిపోర్ట్ ఇచ్చామన్నారు. వైజాగ్ అనేది బెస్ట్ అప్షన్ కాబట్టే చెప్పామని.. కర్నూల్ లో హై కోర్ట్ పెడితే జిరాక్స్ సెంటర్ లకే పరిమితం అవుతుంది అనే వాదన తప్పన్నారు. చాలా మంది రైతులు మా దగ్గరికి వచ్చి అభిప్రాయాలు చెప్పారని.. రైతులకు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలని తాను చెప్పినట్లు జీఎన్ రావు వెల్లడించారు.