మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులో నిందితుడుగా ఉన్న మంగలి కృష్ణ అలియాస్ దొంతులూరి కృష్ణ కిడ్నాప్.. కలకలం రేపింది. అతను కిడ్నాప్ అయ్యాడని తెలియగానే.. రాజకీయంగానూ వాతావరణం వేడెక్కింది. అయితే.. నిజానికి అతను కిడ్నాప్ కి గురికాలేదని, పోలీసులే విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారని తెలిశాక.. ఊపిరి పీల్చుకున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్ లోని రోడ్ నెం.56లో ఉంటున్న సుభాష్ అనే బిల్డర్ ఇంట్లోకి ఈ నెల 2న కొంత మంది ప్రవేశించి కారు అద్దాలు, లైట్లు ధ్వంసం చేశారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతను మంగలి కృష్ణ అనుచరడని పోలీసుల దర్యాప్తులో తేలింది. 

కాగా.. ఈ కేసులో మంగలి కృష్ణను పోలీసులు ఏ1 ముద్దాయిగా పేరు నమోదు చేశారు. దీంతో.. ఈ కేసులో కోర్టులో తనకు తానుగా స్వయంగా లొంగిపోయి.. వెంటనే బెయిల్ ద్వారా బయటకు రావాలని కృష్ణ నాంపల్లి కోర్టుకు వెళ్లాడు. అనంతరం బెయిల్ తీసుకొని వస్తుండగా.. టాస్క్ ఫోర్స్ అధికారులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. 

దీంతో కృష్ణ కిడ్నాప్ అయ్యాడంటూ అతని అనుచరులు హడావిడి చేశారు.కాగా.. పోలీసులు దీనిపై వివరణ ఇచ్చారు. కిడ్నాప్ జరగలేదని..తాము కేసు విచారణలో భాగంగా అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.