ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు తనను ఖరారు చేసినందుకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేశ్ అంబానీ సన్నిహితుడు పరిమల్ నత్వానీ ధన్యవాదాలు తెలిపారు.

సోమవారం సాయంత్రం ట్విట్టర్‌లో స్పందించిన నత్వాని ‘‘ ఏపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించినందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు.

Also Read:వైసీపీ రాజ్యసభ అభ్యర్ధులు వీరే: ముఖేశ్ అంబానీ కోరిక తీర్చిన జగన్

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేసేందుకు కృషి చేస్తానని’’ పరిమల్ ట్వీట్ చేశారు. ముఖేశ్ అంబానీకి అత్యంత సన్నిహితుడైన పరిమల్ నత్వానీ ప్రస్తుతం జార్ఖండ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.

త్వరలో ఆయన రాజ్యసభ పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి పరిమల్‌ను రాజ్యసభకు అవకాశం ఇవ్వాలని అంబానీ స్వయంగా తాడేపల్లి వచ్చి సీఎం వైఎస్ జగన్‌ను కోరారు.

Also Read:రాజ్యసభ ఎన్నికలు: జగన్ తో అంబానీ భేటీ వెనుక రాజకీయం ఇదేనా?

అలాగే ఏపీలో పరిశ్రమల ఏర్పాటు, అభివృద్ధికి సహకరిస్తామని ముఖేశ్ అంబానీ.. ముఖ్యమంత్రికి భరోసా ఇచ్చారు. పార్టీ ముఖ్యనేతలతో చర్చించిన అనంతరం పరిమల్‌ను రాజ్యసభ సభ్యుడిగా పంపాలని జగన్ నిర్ణయించారు.

రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ నుంచి నలుగురు అభ్యర్ధులను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. మంత్రులు మోపిదేవి వెంకట రమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, పారిశ్రామికవేత్త ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, నాలుగో సీటును పరిమల్ నత్వానికి కేటాయించారు వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.