దేశంలో ఢిల్లీ అల్లర్లు, ట్రంప్ పర్యటన ఈ అంశాల మధ్య విడుదలైన రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ గురించి పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. ఈ నెల 26వ తేదీన ఏప్రిల్ లోని వివిధ తేదీల్లో ఖాళీ అయ్యే 55 సీట్లకు ఎన్నికలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. 

ఆంధ్రప్రదేశ్ నుండి నాలుగు సీట్లు, తెలంగాణ నుండి 2 సీట్లకు కూడా అదే రోజున ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలంగాణ నుంచి ఎవరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు అనే అంశాలపై విపరీతమైన చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. 

ఇలా పెద్దల సభకు ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళేవారెవరు అనే చర్చ తీవ్ర స్థాయిలో జరుగుతుండగానే, రాజ్యసభ ఎన్నికలకు నెల రోజుల కన్నా గడువు తక్కువగా ఉండగానే... రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ని కలిశారు. 

Also read: సీఎం జగన్ తో ముఖేష్ అంబానీ సమావేశం... వీటిపైనే చర్చలు

శనివారం రోజు ముఖేష్ అంబానీ, ఆయన కొడుకు అనంత్ అంబానీ, ఆప్త మిత్రుడు పరిమల్ నత్వానిలతో కలిసి రహస్య చర్చలను సుదీర్ఘంగా జరిపారు. సాధారణంగా రిలయన్స్ గ్రూప్ వంటి బడా కంపెనీల అధినేత ఇలా ముఖ్యమంత్రిని కలవడం సాధారణంగా ఏదో బిజినెస్ గురించో... ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడుల గురించో అని అందరూ ఊహిస్తారు. 

ముఖేష్ ఒక్కరే ఇలా వచ్చి కలిస్తే అందరం అలానే ఆలోచించే వారం. కాకపోతే ఇలా పరిమల్ నత్వాని కూడా ఉండడం ఇక్కడ చర్చనీయాంశమయింది. ఈ పరిమల్ నత్వాని రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీకి ఆప్త మిత్రుడు, వారి కుటుంబానికి కూడా చాలా కావలిసిన మనిషి. 

ఈయన ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఝార్ఖండ్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. వచ్చే నెల, ఏప్రిల్ 9వ తేదీన ఈయన పదవి కాలం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఈయనను వెంట బెట్టుకొని ముఖేష్ అంబానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలవడానికి రావడం ఇప్పుడు సర్వత్రా ఆసక్ట్ఘిని రేపుతోంది. 

ఝార్ఖండ్ రాష్గట్రంలో ఇటీవల ముగిసిన ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం మారి అక్కడ కాంగ్రెస్- జేఎంఎం ల కూటమి ప్రభుత్వం హేమంత్ సొరేన్ ముఖ్యమంత్రిత్వంలో ఏర్పడ్డ విషయం తెలిసిందే. కాబట్టి ఈ సారి పరిమల్ కు అక్కడి నుంచి రాజ్యసభ బెర్తు దొరకడం కష్టం. 

స్వతహాగా ఇండస్ట్రియలిస్ట్ అయినా నత్వాని, రిలయన్స్ గ్రూప్ కార్పొరేట్ అఫైర్స్ విభాగానికి ప్రెసిడెంట్ గా కూడా కొనసాగుతున్నారు. రెండు సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించిన నత్వాని కేవలం 40 శాతం హాజరును మాత్రమే ఈ దఫా రాజ్యసభలో కనబరిచినప్పటికీ 1383 ప్రశ్నలను లేవనెత్తాడు. 

ఝార్ఖండ్ నుంచి ఈసారి నత్వాని ఎన్నిక ఇండిపెండెంట్ గా కూడా కావడం కష్టంగా మారింది. ప్రభుత్వం మారడంతో పాటుగా జేఎంఎం అధ్యక్షుడు శిబూ సొరేన్ మరోసారి రాజ్యసభ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ఆసక్తిని కనబరుస్తున్నారు. 

రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం బీజేపీ వర్గాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని నత్వానిని ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్యసభకు పంపేందుకు ఒప్పించినట్టుగా తెలుస్తోంది. 

చర్చను అటుంచినా ప్రస్తుతం బీజేపీ కేంద్ర నాయకత్వంతో జగన్ మోహన్ రెడ్డి సన్నిహిత సంబంధాలను నెరుపుతున్నారు. బీజేపీ ప్రభుత్వంతో, పర్సనల్ గా నరేంద్ర మోడీతో ముఖేష్ అంబానీకి ఉన్న సాన్నిహిత్యం అందరికి తెలిసిందే. 

ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇలా నత్వానిని రాజ్యసభకు పంపేందుకు మొన్నటి జగన్ ఢిల్లీ పర్యటనలోనే బీజాలు పడ్డాయని, మర్యాద పూర్వకంగా అందుకోసమే ముఖేష్ అంబానీ జగన్ ను కలుసుకోవడానికి వచ్చినట్టుగా కూడా పరిస్థితులను బట్టి చూస్తే అవగతమవుతుంది. 

2018లో రిలయన్స్ గ్రూప్ తిరుపతిలో 150 ఎకరాల విస్తీర్ణంలో ఒక ఎలక్ట్రానిక్స్ పేర్కొని ఏర్పాటు చేయనున్నట్టు రిలయన్స్ అధినేత  ముఖేష్ అంబానీ ప్రకటించారు. చంద్రబాబు హయాంలోని గత ప్రభుత్వంతో అంబానీ ఈ ఒప్పందాన్ని చేసుకున్నారు. 

ఎన్నికల తరువాత జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పుడు ఆ పార్కుపై ఎటువంటి చర్చ కూడా సాగట్లేదు. దాదాపుగా జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆ ప్రపోసల్ కోల్డ్ స్టోరేజ్ లోనే ఉంది. 

ఇప్పుడు జగన్ ఇలా ముఖేష్ అంబానీని కలవడం నిజంగా ఆంధ్రప్రదేశ్ కి మంచి శకునము. ఆ ఎలక్ట్రానిక్స్ పర్కా గనుక తిరుపతిలో ఏర్పాటయితే... ప్రస్తుతం ఉన్న ఆర్ధిక పరిస్థితిలో ఆ పెట్టుబడులు ఎంతగానో ఉపయోగపడడమే కాకుండా ఉద్యోగ కల్పనా కూడా జరుగుతుంది. 

ఈ అన్ని పరిస్థితుల నేపథ్యంలోనే జగన్ తో ఇలా ముఖేష్ అంబానీ పరిమల్ నత్వాని తో కలిసి రహస్య చర్చలు జరపడం ఇన్ని చర్చలకు దారి తీసింది. రాజ్యసభ ఎన్నికలకు దాదాపుగా 20 రోజుల సమయం మాత్రమే ఉన్న తరుణంలో చూడాలి ఆంధ్రప్రదేశ్ నుంచి పరిమల్ నత్వాని ఎన్నికవుతారో లేదో!