పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో హృదయవిదారకమైన ఘటన చోటుచేసుకుంది. ఒక కూతురి కోసం.. ఇంకో కూతుర్ని తల్లిదండ్రులే  అమ్మేసిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో దీనిమీద విచారణ చేపట్టారు. 

నెల్లూరులో ఓ పేద దంపతులు పన్నెండేళ్ల తమ కుమార్తె (12)ను రూ.10 వేలకు అమ్మేశారు. కొనుక్కున్న వ్యక్తి ఆ చిన్నారిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం విడవలూరు మండలం దంపూరులో గురువారం వెలుగుచూసింది. 

నెల్లూరులోని కొత్తూరుకు చెందిన దంపతులకు ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కొద్ది రోజులుగా ఆస్పత్రిలో ఉంచి వైద్యం చేయిస్తున్నారు. రోజూ పనికి వెడితే గానీ గడవని కుటుంబం కావడంతో చికిత్సకు డబ్బులు లేక ఇబ్బందులు పడసాగారు. వీరి ఇంటికి దగ్గర్లోనే ఉండే  రోమానికల చిన్నసుబ్బయ్య (46) అనే అతని కన్ను ఈ కుటుంబంపై ఉంది.

చిన్న సుబ్బయ్య భార్య కొన్నేళ్ల కిందటే ఎటో వెళ్లిపోవడంతో అతను ఈ దంపతుల చిన్న కూతుర్ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అందుకే మెల్లిగా ఆ కుటుంబ ఆర్థిక ఇబ్బందులు తెలుసుకున్నాడు. రూ. 10వేలు ఇస్తానని బాలికను అమ్మాలని బేరం పెట్టాడు. అలా రూ. 10వేలకు ఆ బాలికను కొనుక్కున్నాడు. 

ఆ తరువాత రెండు రోజుల క్రితం ఆ చిన్నారిని పెళ్లి చేసుకుని బుధవారం రాత్రి విడవలూరు మండలం దంపూరులోని తన బంధువుల ఇంటికి తీసుకొచ్చాడు. రాత్రి పూట పెద్దగా చిన్నారి ఏడుపులు వినిపించడంతో చుట్టుపక్కల వాళ్లు ఆరా తీశారు. దీంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. 

వారు వెంటనే సర్పంచ్ సురేంద్రరెడ్డి దృష్టికి ఈ విషయం తీసుకెళ్లారు. బాలికను మరొకరి ఇంట్లో ఉంచారు. గురువారం సచివాలయ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో ఐసీడీఎస్‌ అధికారులు దంపూరు వచ్చారు. స్థానికులు చిన్నారిని వారికి అప్పగించారు.

అధికారులు ఆ బాలికను నెల్లూరులోని శిశుసంరక్షణ కేంద్రానికి తరలించారు. అమ్మిన తల్లిదండ్రులు, కొన్న వ్యక్తిపై విచారణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్‌ అధికారులు జైన్‌కుమారి, శైలజ, నాగమ్మ,  దేవసేన, బుజ్జమ్మ, లావణ్య, స్థానికులు నారాయణ, భానుప్రకాశ్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.