ఆపరేషన్ గరుడను రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ నేత పంచుమర్తి అనురాధ అన్నారు.

అమరావతి: ఆపరేషన్ గరుడను రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ నేత పంచుమర్తి అనురాధ అన్నారు. తెలుగుదేశం పార్టీపై కుట్ర జరుగుతోందని ఆమె శుక్రవారం మీడియా సమావేశంలో అన్నారు. 

బీజేపీ, వైసీపీ, జనసేన కలిసి తమ పార్టీపైనే దాడి చేస్తున్నాయని అన్నారు. ఇదంతా కుట్రలో భాగంగానే జరుగుతుందని అన్నారు. కేసుల మాఫీ కోసం జగన్ బీజేపీతో లాలూచీ పడ్డారని ఆరోపించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో కళింగాంధ్ర అంటూ ప్రచారం చేయిస్తున్నారని అన్నారు. 

అవన్నీ చూస్తుంటే ఆపరేషన్ గరుడను రాష్ట్రంలో అమలు చేస్తున్నారా అనే అనుమానం కలుగుతోందని ఆమె అన్నారు. మాజీ ఐఏఎస్‌లతో పుస్తకాలు రాయిస్తున్నారని ఆరోపించారు. 

రాష్ట్రంలో కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికే బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ ప్రకటించిందని ఆమె విమర్శించారు.