అమరావతి: తాము పుట్టిపెరిగిన ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే తట్టుకోలేక ఉద్యమిస్తున్న రాజధాని మహిళలను జగన్ రెడ్డి ప్రభుత్వం వేధిస్తోందని టిడిపి అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. మహిళపై పెట్టిన కేసులు, కొట్టిన దెబ్బలకు ఏం సమాధానం చెప్తారు జగన్? అని ప్రశ్నించారు. మహిళలను బూటు కాళ్లతో తన్నించిన చరిత్ర వారిదంటూ వైసిపి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. 

''శాంతియుతంగా ఉద్యమం చేస్తున్న మహిళలను కొట్టించి, కేసులు పెట్టించిన ఘనత ఒక్క జగన్ రెడ్డికే దక్కుతుంది. ఉగ్రవాద మనస్తత్వంతో మహిళలను బూటుకాళ్లతో తన్నించింది మీరు కాదా జగన్? వందేళ్లకు సరిపడా మహిళలపై క్రిమినల్ కేసులు పెట్టించారు. వృద్ధుల నుండి పసి మొగ్గల వరకు నీ రాక్షస పాలనతో రాష్ట్రంలో రక్షణ లేకుండా పోయింది. నీ చేష్టలు చూసి తెలుగు తల్లి కూడా కన్నీరు పెడుతుంది'' అంటూ జగన్ పై విరుచుకుపడ్డారు. 

''మహిళలు ఆగ్రహిస్తే ఆదిశక్తులై తిరగబడతారన్న సంగతి మర్చిపోవద్దు. మహిళల సత్తా ఏంటో నీకు రుచిచూపించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. కేవలం మహిళల ఓట్లతో జగన్ పతనం కాబోతున్నాడు'' అన్నారు. 

read more   ఇకపై గడ్డుకాలమే... పార్టీపై పట్టు కోల్పోతున్న జగన్: వర్ల సంచలనం

''మహిళలపై రాష్ట్రంలో ఇన్ని అరాచకాలు జరుగుతున్నా ఇప్పటి వరకు స్పందించలేందంటే మహిళల పట్ల ఎంత  గౌరవం ఉందో తెలుస్తోంది. మహిళా రైతులపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తేయాలి. మీపై కేసులున్నాయని మహిళలపై అక్రమ కేసులు బనాయిస్తే ఎలా? మహిళల పోరాటాన్ని గుర్తించి ఆంధ్రుల రాజధానిగా అమరావతిని కొనసాగించాలి'' అని డిమాండ్ చేశారు. 

''300 రోజులు శాంతియుత ఉద్యమం చేయడం రైతుల సహనానికి నిదర్శనం. రైతులను అవమానిస్తూ కొందరు మంత్రులు ఇంకా సిగ్గులేకుండా ప్రవర్తిస్తున్నారు. త్వరలోనే వైసీపీ నేతలకు బుద్ది చెప్పే రోజులు రాబోతున్నాయి'' అని పంచుమర్తి అనురాధ హెచ్చరించారు.