అమరావతి: ఏపీ పంచాయతీరాజ్‌ చట్టం సవరణ బిల్లు–2020ని అసెంబ్లీ ఆమోదించింది. శీతాకాల సమావేశాల తొలి రోజున శాసనసభ వ్యవహారాల కమిటీ(బీఏసీ) సమావేశం తర్వాత సభ తిరిగి ప్రారంభం కాగానే పంచాయతీ రాజ్‌ చట్టం సవరణ బిల్లును సభలో ఆ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రవేశపెట్టారు. 

కీలకమైన ఈ బిల్లుపై చర్చ సందర్భంగా సభా నాయకుడు, సీఎం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ... ఈ పంచాయతీరాజ్‌ చట్టానికి సంబంధించి గతంలోనే సభలో చర్చ జరిగిందన్నారు. ఇంతకు ముందే ఈ బిల్లు తీసుకురావడం జరిగిందని... అయితే ఇక్కడ ఆమోదం పొందిన తర్వాత మండలికి పంపిస్తే వారు దాన్ని వెనక్కి పంపించారన్నారు. మళ్లీ ఇప్పుడు 151 మంది శాసనసభ్యులు ఉన్న ఇదే సభలో ప్రభుత్వం గతంలో ఏమనుకుందో దాన్నే తిరిగి ఆమోదిస్తున్నామని... ఇది కేవలం ఫార్మాలిటీ మాత్రమే అన్నారు. మళ్లీ శాసనమండలి సభ్యులు గానీ, ప్రతిపక్షాలు గానీ నో చెప్పడానికి వీలు లేదన్నారు. 

read more  పంట నష్టంపై అసెంబ్లీలో నిరసన: చంద్రబాబు సహా 13 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

''అయితే ఇది కొత్తగా పెడుతున్నట్లు, ఏమీ తెలియనట్లు టిడిపి వారు విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు మళ్లీ కొత్తగా బిల్లు పెడతున్నట్లు అభ్యంతరం చెబుతున్నారు'' అన్నారు. 

''ఎన్నికల్లో ఎవరైనా ఓటర్లను ప్రభావితం చేసే విధంగా డబ్బు ఖర్చు పెడితే, ఆ తర్వాత వారిపై చర్య తీసుకునే విధంగా వినూత్నంగా ఈ చట్టం చేస్తున్నాం. ఎన్నికల్లో ఎవరూ డబ్బు ఖర్చు పెట్టకుండా చేయడం కోసమే ఈ చట్టం సవరణ. అదే విధంగా ఏ రకంగా వేగంగా ఎన్నికల ప్రక్రియ ఆలస్యం లేకుండా త్వరితగతిన పూర్తయ్యేలా మార్పులు చేస్తున్నాం. దీనిపై గతంలోనే విస్తృత చర్చ జరిగింది'' అని గుర్తుచేశారు. 

''గతంలో శాసనసభలో ఆమోదించి మండలికి పంపిస్తే వారు వెనక్కి పంపారు. కాబట్టి ఫార్మాలిటీగా ఇప్పుడు బిల్లును ప్రవేశపెట్టాం. అంతే తప్ప ఆయన (చంద్రబాబు) ఆమోదించాలని కాదు'' అని సీఎం జగన్ స్పష్టం చేశారు. సీఎం ప్రసంగం తర్వాత ఏపీ పంచాయతీరాజ్‌ చట్టం సవరణ బిల్లు–2020ను సభ  ఆమోదించింది.