పల్నాడు జిల్లాలో టీడీపీ మైనార్టీ నేత సయ్యద్ అన్వర్ బాషా అరెస్ట్ ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
పల్నాడు : ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నేత అరెస్టు కలకలం సృష్టిస్తోంది. పల్నాడు జిల్లా మాచర్లలో టిడిపి మైనారిటీ నేత సయ్యద్ అన్వర్ భాషను బుధవారం అర్ధరాత్రి సివిల్ దుస్తుల్లో వచ్చిన పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. ఒక గంటలో విచారించి, పంపిస్తామని చెప్పి తీసుకు వెళ్లిన పోలీసులు తెల్లారినా పంపించలేదు. అంతేకాదు సయ్యద్ అన్వర్ భాషను ఎక్కడికి తీసుకువెళ్లారు.. ఎక్కడ ఉంచారో. కూడా కుటుంబ సభ్యులకు తెలియదు. దీంతో తీవ్ర ఆందోళన చెందారు.
కుటుంబ సభ్యులు తమ కొడుకు కోసం నియోజకవర్గంలోని అన్ని స్టేషన్లలో ఆరా తీశారు. అయినా సమాచారం తెలియలేదు. బక్రీద్ రోజు కొడుకును అరెస్టు చేయడంతో ఆ తల్లిదండ్రులు మానసిక క్షోభకు గురవుతున్నారు. చివరికి సయ్యద్ భాషను గురువారం సాయంత్రం న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. సయ్యద్ భాషను కారంపూడిలో ఇటీవల జరిగిన కేసులో నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. జడ్జి సయ్యద్ అన్వర్ భాషకు 14 రోజుల రిమాండ్ విధించారు.
ఏపీలో భూముల ధరలపై కేసీఆర్ వ్యాఖ్యలు.. జగన్ వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి : చంద్రబాబు
సయ్యద్ అన్వర్ భాష మాచర్ల నియోజకవర్గంలోని టిడిపి ఇన్చార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డికి అనుచరుడు. మాచర్లలో ఇటీవల టిడిపి చేపట్టిన భవిష్యత్తుకు గ్యారెంటీ బస్సు యాత్ర విజయవంతమయింది. దీని వెనక అన్వర్ భాష కీలక పాత్ర పోషించాడు. ఆ యాత్ర సందర్భంగా రోజంతా డీజే పెట్టి పాటలతో పట్టణంలో హోరెత్తించాడు. దీన్ని వైసిపి నాయకులు జీర్ణించుకోలేకపోయారని, ఈ నేపథ్యంలోనే టిడిపిలో క్రియాశీలకంగా ఉన్న అతడిని వేదించడానికి అక్రమ కేసులు పెట్టారని ఆరోపణలు చేస్తున్నారు.
దీనికి తోడు కారంపూడిలో ఈనెల 20వ తేదీ ఉదయం టిడిపి, వైసీపీ నేతల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవ కారణంగా పోలీసులు ఇరు వర్గాల మీద కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ వారు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ముగ్గురు టీడీపీ నేతల మీద కేసులు నమోదయ్యాయి. ఇందులో సయ్యద్ అన్వర్ భాషను చేర్చారు. ఈ కేసులోనే కారంపూడి పోలీసులు బుధవారం అర్ధరాత్రి అన్వర్ భాషను అరెస్టు చేశారు. ఈ ఘటనతో అన్వర్ కు సంబంధం లేదు. కానీ, హత్యాయత్నం కేసులో ఇరికించారని ఆరోపణలు ఉన్నాయి.
అన్వర్ భాషను అరెస్టు చేసే సమయంలో ఇంట్లో, ఆ ఏరియాలో కరెంటు లేదు.. పోలీసులు తలుపులు కొట్టి అన్వర్ కావాలని అడిగారు. ఆయనను తీసుకెళ్లి ఒక గంట విచారించి పంపిస్తామని చెప్పడంతో.. తల్లి మీరాభి ఈ రాత్రి పూట వద్దని తన కొడుకు గొడవలకు పోయేవాడు కాదని.. తెల్లారి తీసుకెళ్లాలని చెప్పింది. అయినా పోలీసులు పట్టించుకోకుండా తీసుకెళ్ళిపోయారు. అందరూ సివిల్ దుస్తుల్లోనే వచ్చారు.
గుర్తుపట్టడానికి వీలు లేకపోయింది. అర్ధరాత్రి ఒంటిగంట దాటిన తర్వాత రావడంతో.. అది కూడా మఫ్టీలో రావడంతో వాళ్లు పోలీసులేనా అనేది కుటుంబ సభ్యులు అనుమానించారు. ఆ తర్వాత అన్వర్ కోసం తీవ్రంగా గాలించారు. అన్వర్ భాషా తల్లి మీరాభి, భార్య అయేషా అన్వర్ అరెస్టు మీద ఆందోళన వ్యక్తం చేశారు. ‘అర్ధరాత్రి వచ్చి మహిళలు, పిల్లలను భయాందోళన గురిచేసి తీసుకెళ్లడం ఎంతవరకు కరెక్ట్.. పొద్దున పూట వచ్చి తీసుకెళ్లొచ్చు కదా.. ఏ కేసులో అరెస్టు చేస్తున్నామని కూడా చెప్పలేదు ఎక్కడికి తీసుకెళ్తున్నారో కూడా తెలియదు…’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
మాచర్లలో ఉంటున్న అన్వర్ కారంపూడి ఘటనలో.. అదీ కావాలని బక్రీద్ పండుగ వేళా అరెస్టు చేయడం మీద ముస్లిం సంఘాలు మండిపడుతున్నాయి. వారం రోజుల క్రితం జరిగిన ఘటనలో అర్ధరాత్రి పూట అరెస్టు చేయడమేంటని ప్రశ్నించాయి. కారంపూడి లో జరిగిన ఘటనలో నిందితుడుగా అన్వర్ ను అరెస్టు చేసిన పోలీసులు గురువారం సాయంత్రం న్యాయమూర్తి ఇంటిదగ్గర హాజరుపరిచారు. ఆయనకి 14 రోజుల రిమాండ్ విధించాడు జడ్జి.
అయితే ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ అన్వర్ భాష ఆవేదన వ్యక్తం చేశారు గురువారం సాయంత్రం న్యాయమూర్తి ఎదురుగా హాజరైన ఆయన…ఇంతకంటే ఇంకేం చేయగలరంటూ ప్రశ్నిస్తూ తన కూతుర్ని పట్టుకొని భోరున ఏడ్చాడు. తనను ఓ ప్రైవేటు వాహనంలో తీసుకెళ్లి, కొట్టారన్నారు. తనను వారం రోజుల క్రితం జరిగిన ఓ గొడవలో 13వ ముద్దాయిగా పేర్కొన్నట్లు.. అయితే తనకు ఆ గొడవకు ఎలాంటి సంబంధం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తెల్లవారితే బక్రీద్ అనగా ముస్లిం సోదరుడిపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేస్తారా? అంటూ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా? రాక్షస రాజ్యమా? మీరు మనుషులేనా? మానవత్వం ఉందా? అంటూ మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా ఈ అరెస్టును ఖండించారు. ఎప్పుడో ఎక్కడో జరిగిన వివాదంతో ముడిపెట్టి హత్యాయత్నం కేసులో అరెస్ట్ చేస్తారా? అంటూ మండిపడ్డారు. ముస్లిం సమాజం వైసీపీకి బుద్ది చెబుతుందంటూ పేర్కొన్నారు.
