పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి చెందిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఆమె తన సొంత వదినతో గొడవపడిన సంఘటన ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే...పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఆమె వదిన గిడ్డి విజయలక్ష్మి తగాదా పడిన వీడియో క్లిప్పింగ్‌ ఆదివారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఎమ్మెల్యే ఈశ్వరి తన స్వగ్రామం కుమ్మరిపుట్టులో తన వదిన వద్దే రూ. 2 లక్షలకు భూమికి కొనుగోలు చేసి ఇంటి నిర్మాణానికి పనులు చేపడుతున్నారు. 

అలాగే ధాన్యం నిల్వల కోసం గదిని నిర్మించే క్రమంలో ఎమ్మెల్యే ఈశ్వరి, ఆమె వదిన విజయలక్ష్మిల మధ్య ఆదివారం ఉదయం వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో వారిద్దరు తోసుకున్నారు. దీంతో ఎమ్మెల్యే ఈశ్వరి కిందపడి పోయారు. తర్వాత ఎమ్మెల్యే, తన వదిన విజయలక్ష్మితో వాదిస్తున్నారు. 

28 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో క్లిప్పింగ్‌ వాట్సాప్‌ గ్రూప్‌లు, ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నది. ఈ వీడియో గురించి ఎమ్మెల్యే ఈశ్వరి వద్ద ప్రస్తావించగా.. తమ కుటుంబ వ్యవహారాన్ని ఇలా సోషల్‌ మీడియాలో పెట్టడం తగదని ఖండించారు.