ఓయూ హాస్టళ్లలో నాన్ బోర్డర్స్ ఖాళీ చేయిస్తున్న అధికారులు నిరసనగా వంటా వార్పు కార్యక్రమాన్ని రోడ్డుపైనే నిర్వహించిన విద్యార్థులు తమ జీవితాలతో ఆడుకోవద్దని అధికారులకు వేడుకోలు
విద్యార్థులకు ఉద్యోగాలిచ్చి వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వమే వారిని రోడ్డున పడేసింది. తెలంగాణ విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పిన యూనివ ర్సిటీ ఇపుడు వారిని దరికి చేరనీయడం లేదు. ఎంతో మంది నిరుద్యోగులైన విద్యార్థులను నిబంధనల పేరిట అధికారుల వేధింపులు కాదు కాదు వెలివేతలు ఎక్కువయ్యాయి. ఇవన్నీ జరుగుతున్నది ఎక్కడో కాదు... దేశంలోనే పేరెన్నికగన్న మన ఉస్మానియా యూనివర్సిటీలోనే.
తమ జీవితాలను పనంగా పెట్టి వారు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నదే ఈ ఉద్యోగాల కోసం. ఇన్నాళ్లు నిరుద్యోగులను వెక్కిరించిన ఉద్యోగ ప్రకటనలు ఒకటి వెంట ఒకటిగా వస్తున్నాయి. ఇలాంటి సమయంలో విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోంది తెలంగాణప్రభుత్వం. పీజీలు అయిపోయినా జాబ్ కోసం ఎదురు చూస్తూ, తాత్కాలికంగా ఓయూ లోనే తల దాచుకుని చదువుకుంటున్న వారిని నాన్ బోర్డర్స్ పేరుతో ఖాళీ చేయించే నెపంతో విద్యార్థులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. హాస్టళ్లలో విద్యుత్ సరఫరా నిలిపివేయడం,నీటి సరఫరా నిలిపివేయడం, మెస్ లను కూడా మూయించి నానా విధాలుగా హింసిస్తున్నారు.
దీనికి నిరసనగా విద్యార్థులు రోడ్లపైకి వచ్చి తమ నిరసనను తెలిపారు. వంటా వార్పు కార్యక్రమాన్ని రోడ్డుపైనే నిర్వహించారు. అక్కడే తిని తమ అవస్థలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. తమకు అత్యంత విలువైన సమయాన్ని వృదా చేస్తన్న అధికారుల తీరును తప్పుబట్టారు.

ఇప్పటికే అనేక ఉద్యోగ ప్రకటనలు వచ్చాయి. రానున్నది ఎన్నికల సమయం కాబట్టి వీటి సంఖ్య ఇంకా గణనీయంగా పెరగనుంది. అంతే కాకుండా డీఎస్సీ నోటిఫికేషన్ త్వరలో రానుందన్న ఊహాగానాల నేపథ్యంలో విద్యార్థులు తిండితిప్పలు మని చదువుతున్నారు. అలా యూనివర్సిటీలో చాలామంది గ్రామాల నుంచి వచ్చి హాస్టళ్లలో ఉంటూ చదువుకుంటున్నారు.
ఇన్నాళ్లు నీడనిచ్చిన క్యాంపస్ ని వదలి వేరే చోట వుండలేక, ఆర్థిక స్తోమత అసలే లేక విద్యార్థులు రోడ్డునపడ్డారు. అధికారులు దయతలిచి తమను వేధించడం ఆపి, హాస్టళ్లలో ఇబ్బందులు లేకుండా చూడాలని వారు ప్రభుత్వాన్ని, యూనివర్సిటి అధికారులను కోరుతున్నారు. అందుకోసమే ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. తెలంగాణ వచ్చిన తొలి ఏడాదిలోనే లక్ష ఉద్యోగాలు ఇచ్చి ఉంటే జాబ్ కొట్టుకొని వెళ్లిపోయేవాళ్ళం కదా? అపుడు ఓయూలో ఉండమన్నా ఉండేవాళ్ళం కాదుగా అని వారు చెబుతున్నారు. ఇపుడు టీఆరెస్ లో పదవుల్లో ఉన్నవాళ్లు చాలా మంది నాన్ బోర్డర్ గా ఉన్న ముచ్చట కేసీఆర్ సర్కారు గుర్తు ఉంచుకుంటే మంచిది అని వారు హెచ్చరిస్తున్నారు.
