కృష్ణా జిల్లా పెదపారుమూడి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుండి నరసాపురం  వెళుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్ సంస్థకు చెందిన బస్సు అదుపుతప్పి పంటకాలువలో పడిపోయింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నారు. 

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.  ప్రైవెట్ ట్రావెల్ సంస్థ ఆరెంజ్ కు చెందిన ఓ బస్సు రోజూ మాదిరిగానే 40 మంది ప్రయాణికులతో రాత్రి సమయంలో హైదరాబాద్ నుండి నరసాపురానికి బయటుదేరింది. అయితే మరికాసేపట్లో గమ్యస్థానానికి చేరతారనగా ఈ బస్సు ప్రమాదానికి గురయ్యింది. కృష్ణా జిల్లా వానపాముల వద్ద బస్సు అదుపుతప్పి పంటకాలువలో పడిపోయింది.

ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, ఇతర వాహనదారులు సహాయక చర్యలు చేపట్టి గాయపడిన వారిని బైటికితీసి గుడివాడ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ తో పాటు మరో సిబ్బంది పారిపోయారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బస్సు సిబ్బంది కోసం పోలీసులు గాలిస్తున్నారు.