వచ్చే ఎన్నికలకు సంబంధించి వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంతకీ ఆ సంచలన నిర్ణయం ఏమిటంటే, వీలైనంతలో ప్రతీ సామజికవర్గం మద్దతును కూడగట్టుకోవటానికి ప్రత్యేక ప్లాన్ వేసినట్లు స్పఫ్టంగా తెలుస్తోంది. అందులోనూ మొత్తం ఓటర్లలో బిసి సామాజికవర్గం ఓటర్ల సంఖ్య చాలా ఎక్కువ కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు.

ఒక అధ్యయనం ప్రకారం మొత్తం జనాభాలో బిసిలు సుమారు 54 శాతం ఉంటారు. 140 కులాలు కలిపి బిసిలన్న విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే ప్రతీ కులానికీ కచ్చితంగా ఓ పదవి ఇవ్వాలని జగన్ నిర్ణయించారు. అంటే అందరికీ ఎంఎల్ఏనో లేకపోతే ఎంపి పదవో ఇస్తానని కాదు జగన్ ఉద్దేశ్యం. గ్రామస్ధాయి నుండి ఢిల్లీ స్ధాయి వరకూ ఎక్కవ అవకాశం ఉంటే అక్కడ వీలున్నంతలో బిసిలకు అగ్రస్ధానం ఇవ్వాలన్నదే జగన్ ఉద్దేశ్యం.

 చిత్తూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న జగన్ వడమాలపేటలో జరిగిన బిసి సదస్సులో పాల్గొన్నారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ, అదే విషయాన్ని ప్రస్తావించారు. వైసిపి అధికారంలోకి రాగానే ప్రతీ కులానికి ఓ పదవి వచ్చేట్లు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.  వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ గెలవాలన్నా బిసిల ఓట్లు చాలా కీలకమన్న విషయం అందరికీ తెలిసిందే.

మొత్తం ఓట్లలో ఒకవైపు కాపులు, మరోవైపు బిసిలే నిర్ణయాత్మకశక్తి. అందుకనే చంద్రబాబునాయుడు రెండు సామాజికవర్గాలను చెరోవైపు ఉంచుకుని మెల్లిగా దువ్వుతున్నారు. చంద్రబాబు ఏమి చేసినా వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసమే అన్నదాంట్లో అనుమానం లేదు.  ఎందుకంటే, ఇటు చంద్రబాబునాయుడుకైనా అటు జగన్మోహన్ రెడ్డికైనా వచ్చే ఎన్నికలే అత్యంత కీలకమన్న విషయం గమనార్హం.