సున్నా వడ్డీ పథకం గురించి ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు ఘాటుగా స్పందించారు. సున్నా వడ్డీకి సంబంధించి ఆయన సభకు డాక్యుమెంట్లు సమర్పించారు. సున్నా వడ్డీకి చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలు అవాస్తవమని చంద్రబాబు స్పష్టం చేశారు.

సిగ్గు ఉండాలా అంటూ తమను దూషించడంపై వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తికి సంస్కారం కూడా ఉండాలని ఆయన హితవు పలికారు.

ఐదేళ్లలో 415 కోట్లు జీరో వడ్డీకి కేటాయించామని చంద్రబాబు తెలిపారు. వడ్డీ లేని రుణాలు ఏ సంవత్సరంలో ఎంత ఇచ్చామో ఆయన సభలో వివరించారు. 2011 నుంచి తాము రుణాలను క్లియర్ చేశామని... అలాంటి తనను రాజీనామా చేసి వెళ్లిపోతారా అని ముఖ్యమంత్రి సవాల్ విసిరారని బాబు ఎద్దేవా చేశారు.

గాడిదలు కాస్తున్నారా లాంటి మాటలు పడేందుకా తనను ప్రజలు అసెంబ్లీకి పంపించిందని ప్రశ్నించారు. జగన్ రాజీనామా చేస్తారా.. ప్రజలకు క్షమాపణలు చెబుతారా అని చంద్రబాబు డిమాండ్ చేశారు. అది చెప్పాల్సిన బాధ్యత జగన్‌పైన.. చెప్పించాల్సిన బాధ్యత స్పీకర్‌పైన ఉందంటూ ప్రతిపక్షనేత సూచించారు.