ఆంధ్రప్రదేశ్ లోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభోగంగా జరుగుతున్నాయి. ఆరోరోజైన నేడు స్వామివారు శివధనుర్భంగాలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చాడు. 


ఒంటిమిట్ట : Ontimittaలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు శుక్రవారం ఉదయం శివధనుర్భంగాలంకారంలో రాములవారి రాజసం భక్తులకు కనువిందు చేసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఊరేగింపు 10 గంటల వరకు జరిగింది. భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయిద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా సాగుతోంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు.

స్వయంవరం సమయంలో శ్రీరాముడు శివుని విల్లును విరిచి సీతమ్మవారిని వివాహమాడే ఘట్టాన్ని గుర్తుచేసేది శివధనుర్భంగాలంకారం. సీతారాముల కల్యాణం రోజున ఉదయం ఈ అలంకారంలో స్వామివారు భక్తులను కటాక్షించారు. అనంతరం ఉదయం 11 నుండి 12 గంటల వరకు ఆలయంలో స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహిస్తారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో స్వామి, అమ్మవారికి వేడుకగా అభిషేకం చేశారు. రాత్రి 11 నుండి 12 గంటల వరకు గజవాహనసేవ అత్యంత వేడుకగా జరగనుంది.

గజ వాహనం : ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజు శుక్రవారం రాత్రి శ్రీ సీతారాముల కల్యాణం తరువాత గజవాహనంపై శ్రీ సీతారాములు భక్తులను కటాక్షించనున్నారు. సీతారాములు మాత్రమే కలిసి విహరించే ఈ వాహనానికి ఎంతో విశిష్టత ఉంది. రాజసానికి ప్రతీక మదగజం. రణరంగంలో కానీ, రాజదర్బారులలో కానీ, ఉత్సవాల్లో కానీ గజానిదే అగ్రస్థానం. అటువంటి వాహనసేవలో గజేంద్రుడు రాములవారిని వహించునట్లు భక్తులు సదా కోదండరాముని హృదయ పీఠికపై వహించి స్వామికృపకు పాత్రులుకాగలరు. వాహ‌న‌ సేవ‌లో డెప్యూటీ ఈవో శ్రీ‌ రమణప్రసాద్, ఏఈవో సుబ్రహ్మణ్యం, సూపరింటెండెంట్ పి.వెంకటేశయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ ధనుంజయ, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

ఇదిలా ఉండగా, క‌డ‌ప జిల్లా రాజంపేట తాలుకా ఒంటిమిట్ట ప‌ట్ట‌ణంలో కొలువై ఉన్న శ్రీ కోదండ‌రామస్వామి ఆల‌యంలోని సీత‌మ్మ‌వారికి నిరుడు ఆగస్ట్ 25న ఓ భ‌క్తుడు బంగారు హారాన్ని బ‌హూక‌రించాడు. క‌ర్నూల్‌కు చెందిన సి.పుల్లారెడ్డి బుధ‌వారం ఉద‌యం రూ.1.85 ల‌క్ష‌ల విలువ గ‌ల 38.042 గ్రాముల బంగారు హారాన్ని అమ్మ‌వారికి కానుక‌గా స‌మ‌ర్పించాడు. ఈ సందర్భంగా ఆల‌య‌ ఏఈవో ముర‌ళీధ‌ర్‌కు ఆయన హారాన్ని అంద‌జేశారు. అనంత‌రం వేద పండితులు హారానికి పూజ‌లు నిర్వ‌హించి, అమ్మ‌వారికి అలంక‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆలయన సూప‌రింటెండెంట్ వెంక‌టేష్‌, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్ గిరి, ఆల‌య అర్చ‌కులు పాల్గొన్నారు.

కాగా, గత రెండేళ్లుగా కరోనా కారణంగా ఒంటిమిట్ట దేవాలయాన్ని ఈ సమయానికి మూసివేశారు. నిరుడు ఏప్రిల్ 16న కరోనా కల్లోలం నేపథ్యంలో కడప జిల్లాలోని ఒంటిమిట్టలోని కోదండరాముని ఆలయాన్ని మూసివేశారు. కరోనా కేసుల పెరుగుదలతో ఆలయాన్ని మూసివేసినట్టుగా అధికారులు ప్రకటించారు. టీటీడీ అధికారుల ఆదేశం మేరకు ఆలయాన్ని మూసివేస్తున్నట్టుగా చెప్పారు. అంతకుముందు ఏడాది (2020)మార్చి మాసంలో కూడా ఈ ఆలయాన్ని మూసివేసిన విషయం తెలిసిందే.