ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి నేటితో స‌రిగ్గా ఏడాది గ‌డించింది. ఈ నేప‌థ్యంలో ఏడాది కాలంలో కూట‌మి ప్ర‌భుత్వం తీసుకున్న ప‌లు కీల‌క నిర్ణ‌యాల గురించి తెలుసుకుందాం.

కూటమి పాలనలో ముఖ్య విజయాలు

జోరందుకున్న అమ‌రావ‌తి

వైసీపీ పాల‌న‌లో ఆగిపోయిన అమ‌రావ‌తి ప‌నుల‌ను కూట‌మి ప్ర‌భుత్వం తిరిగి ప్రారంభించింది. కొన్ని కీలక టెండర్లు జారీ కావడంతో అమరావతి నిర్మాణంలో వేగం పెరిగింది. ప్ర‌పంచ స్థాయి రాజ‌ధాని నిర్మిస్తామ‌న్న దిశ‌గా చంద్ర‌బాబు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. ప్ర‌ధాని మోదీ చేతుల‌తో అమ‌రావ‌తి పునఃనిర్మాణ ప‌నుల‌ను ప్రారంభించారు.

పోలవరం ప్రాజెక్టు పునరుద్ధరణ

పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడాన్ని చంద్ర‌బాబు ల‌క్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే నిత్యం ప‌నులను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. అద‌నంగా రాయలసీమ అనుసంధానానికి "బనకచర్ల లింక్" అనే కొత్త ప్రతిపాదనను ప్రకటించారు.

రోడ్ల మరమ్మత్తులపై దృష్టి

వైసీపీ పాలనలో రోడ్ల‌న్నీ అధ్వాన్నంగా మారాయ‌న్న ఆరోప‌ణ‌లు చేసిన కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత తక్షణమే చర్యలు చేపట్టారు. గ్రామీణ రహదారులు, జాతీయ రహదారుల నిర్మాణాన్ని చేప‌ట్టారు.

భారీ పెట్టుబడుల ప్రయత్నం

కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలోనే రూ. 9 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రాజెక్టులకు ప్రణాళికలు రూపొందించిందని నాయ‌కులు తెలిపారు. అమరావతిలోని ‘క్వాంటం వ్యాలీ’ ప్రాజెక్టు పట్ల ప్రభుత్వం గేమ్‌చేంజర్‌గా చూస్తోంది. అలాగే విజ‌యవాడ‌, విశాఖ‌లో మెట్రో రైలు ప్రాజెక్టులపై స్పష్టమైన దిశలో అడుగులు వేస్తోంది.

పెన్ష‌న్ పెంపు

అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే కూట‌మి ప్ర‌భుత్వం వెంట‌నే తీసుకున్న నిర్ణ‌యాల్లో పెన్ష‌న్ల పెంపు ఒక‌టి. ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీ మేర‌కు ఎన్టీఆర్ భ‌రోసా ప‌థ‌కం కింద పెన్ష‌న్‌ను రూ. 4 వేల‌కు పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నారు.

లోపాలు , విమర్శలు

వాలంటీర్ వ్యవస్థ తీరుపై అసంతృప్తి

ఎన్నికల సమయంలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని చెప్పినప్పటికీ, అధికారంలోకి వచ్చాక వెంటనే రద్దు చేయడం గమనార్హం. దీని స్థానంలో ఏర్పాటు చేసిన వ్యవస్థ పరిపూర్ణంగా పని చేయడం లేదన్న అభిప్రాయం చాలామందిలో ఉంది.

బీజేపీ దూకుడు

ఏపీ కూటమిలో భాగమైనా, బీజేపీ త‌మ అస్తిత్వం కోసం ప్ర‌య‌త్నిస్తుంద‌న్న వాద‌న టీడీపీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది. ఈ విష‌యాన్ని బ‌హిరంగంగా చెప్ప‌క‌పోయినా లోలోప‌ల ఇదే ఫీలింగ్‌తో ఉన్నార‌న్న అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. జ‌న‌సేన‌, టీడీపీ మ‌ధ్య కూడా ఆదిప‌త్య పోరు ఉందంటూ వార్త‌లు వ‌చ్చాయి. అయితే జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ మాత్రం ఈ విష‌యంపై ఎప్ప‌టిక‌ప్పుడు స్ప‌ష్ట‌త‌నిస్తూ వ‌చ్చారు.

సూపర్ సిక్స్ అమలులో జాప్యం

ప్రభుత్వం హామీ ఇచ్చిన ‘సూపర్ సిక్స్’ పథకాల్లో కొన్నింటి అమ‌లు ఆల‌స్యమ‌వుతుంద‌న్న అసంతృప్తి కొన్ని వ‌ర్గాల్లో ఉన్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది. ముఖ్యంగా తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు ఇంకా పూర్తిగా అమలులోకి రాలేదు.

తిరుపతిలో కల్తీ నెయ్యి వ్యవహారం

తిరుమ‌ల ల‌డ్డులో క‌ల్తీ నెయ్యి ఉప‌యోగించార‌ని చంద్ర‌బాబు తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. దీనిపై విచార‌ణ క‌మిటీ కూడా వేశారు. అయితే దీనిపై ఒక కంక్లూజ‌న్ మాత్రం ఇవ్వ‌లేక‌పోయారు. దీంతో రాజ‌కీయం కోసం భ‌క్తుల మ‌నోభావాల‌తో చెల‌గాట‌మాడార‌న్న ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి.

టీడీపీలో అసంతృప్తి

మూడు పార్టీల పొత్తు కార‌ణంగా టీడీపీలో కొంద‌రికీ అన్యాయం జ‌రిగిందంటూ ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. పార్టీ కోసం ఎంతో క‌ష్ట‌ప‌డి ప‌నిచేసిన త‌మ‌కు స‌రైన న్యాయం జ‌ర‌గ‌లేదంటూ కొంద‌రు నాయ‌కులు త‌మ అసంతృప్తిని వ్య‌క్తం చేశారు.