Asianet News TeluguAsianet News Telugu

నంద్యాలలో తేనేటీగల దాడి: ఒకరు మృతి, మరో ఇద్దరికి గాయాలు

నంద్యాల జిల్లాలోని ప్యాపిలి మండలం పీఆర్‌పల్లెలో గురువారం నాడు కుటుంబంపై తేనేటీగలు దాడికి దిగాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు.  

One dead, 2 hospitalised in Andhra Pradesh After Bee Attack lns
Author
First Published Sep 28, 2023, 4:23 PM IST

నంద్యాల: జిల్లాలోని ప్యాపిలి మండలం పీఆర్‌పల్లెలో  గురువారంనాడు పొలం పనులకు వెళ్లిన  కుటుంబంపై  తేనేటీగలు దాడి చేశాయి.  ఈ ఘటనలో ఫక్రున్ అనే వృద్దురాలు మృతి చెందారు.  షఫీ అనే బాలుడి పరిస్థితి విషమంగా ఉంది. మహబూబ్ బాషా అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

గతంలో కూడ  రెండు తెలుగు రాష్ట్రాల్లో  తేనేటీగల దాడులు అనేకం చోటు చేసుకున్నాయి. కొన్ని ఘటనల్లో పలువురు గాయపడ్డారు.2022  నవంబర్ 20న  అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వన భోజనాలకు వెళ్లిన మహిళలపై తేనేటీగలు దాడి చేశాయి.  25 మంది మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. 2020  మే 31న తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో  ప్రముఖ సినీ నటుడు చిరంజీవి కుటుంబ సభ్యులపై  తేనేటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.2020 సెప్టెంబర్ 22న  కర్నూల్ జిల్లాలోని బనకచర్ల హెడ్ రెగ్యులేటరీ వద్ద  తేనేటీగలు దాడి చేయడంతో ఇంజనీర్ మృతి చెందాడు. 2022 మార్చి 19న తెలంగాణలోని మణుగూరులో  పరీక్ష రాసేందుకు వచ్చిన ఇద్దరు విద్యార్థులపై తేనేటీగలు దాడి చేశాయి.  ఈ ఘటనలో  ఇద్దరు విద్యార్ధులు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ఏడాది మార్చి  26వ తేదీన అనకాపల్లి జిల్లాలో దంపతులపై దాడి చేయడంతో  భర్త మృతి చెందారు. భార్య తీవ్రంగా గాయపడింది. కామానాయుడు, నూకాలమ్మలు గొర్రెలు మేపేందుకు వెళ్లిన సమయంలో వారిపై తేనేటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో  కామానాయుడు మృతి చెందాడు.ఈ ఏడాది  మార్చి 13న  స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య తేనేటీగల దాడి నుండి తృటిలో తప్పించుకున్నారు.  ఉప్పుగల్ లో బోనాల ఉత్సవాలకు వెళ్లిన సమయంలో  కాగడాలు వెలిగించడంతో  తేనేటీగలు దాడి చేశాయి. ఈ విషయాన్ని గుర్తించిన  ఎమ్మెల్యే రాజయ్య సెక్యూరిటీ ఆయనను సురక్షితంగా  కారు వద్దకు తీసుకెళ్లారు. 

also read:బేతంచర్లలో తేనేటీగల దాడి:తృటిలో తప్పించుకున్న మంత్రి బుగ్గన

ఈ ఏడాది జూన్  28వ తేదీన బేతంచర్లలో తేనేటీగలు దాడి చేశాయి. ఏపీ మంత్రి  బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని సెక్యూరిటీ సిబ్బంది తేనేటీగల దాడి నుండి తప్పించారు.  మంత్రి  పర్యటన సమయంలో  ఆయనతో పాటు  ఉన్న 70 మందిపై తేనేటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో మంత్రి గన్ మెన్లు, జర్నలిస్టులు కూడా గాయపడ్డారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios