గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో మరోసారి ఇళ్ల కూల్చివేత ప్రక్రియను చేపట్టేందుకు అధికారులు సిద్దమయ్యారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది.
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇప్పటంలో మరోసారి ఇళ్ల కూల్చివేత ప్రక్రియను చేపట్టేందుకు అధికారులు సిద్దమయ్యారు. రోడ్డు విస్తరణకు సంబంధించి గతంలో ఇప్పటంలో అధికారులు కట్టడాల తొలగింపు ప్రక్రియను చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే తాజాగా మిగిలిన కట్టడాల తొలగింపుకు సంబంధించి ఇటీవల అధికారులు మరోమారు నోటీసులు అందజేసినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే నేడు గ్రామంలో కూల్చివేత ప్రక్రియను చేపట్టేందుకు సిద్దమయ్యారు. ప్రొక్లైనర్లతో అధికారులు గ్రామానికి చేరుకున్నారు. కూల్చివేత ప్రక్రియ నేపథ్యంలో గ్రామంలో పోలీసులు కూడా భారీగా మోహరించారు. దీంతో ఇప్పటంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
ఇక, ఇప్పటంలో కట్టడాల కూల్చివేత ప్రక్రియను జనసేనతో వివిధ ప్రతిపక్ష పార్టీలు కూడా ఖండించాయి. జనసేన పార్టీ ఆవిర్భావ సభకు స్థలాన్ని ఇచ్చినందుకే ఇప్పటం గ్రామస్థులను ప్రభుత్వం ఇబ్బందులు పెడుతుందని జనసేన ఆరోపించిన సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వయంగా ఇప్పటం వెళ్లి అక్కడ కూల్చివేతలను పరిశీలించారు. కూల్చివేత బాధితులను కూడా పవన్ కల్యాణ్ పరామర్శించారు. తర్వాత వారికి జనసేన తరఫున సాయం కూడా అందజేశారు. వారికి జనసేన అండగా ఉంటుందని చెప్పారు. అయితే జనసేన, విపక్షాల ఆరోపణలను ప్రభుత్వం ఖండించింది.
