ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ ను నయం చేసే మందు తనవద్ద వుందంటూ ప్రకటించిన కృష్ణపట్నం ఆనందయ్యకు చిక్కులు ఎదురయ్యాయి. ఆయనకు ఇప్పటికే ప్రభుత్వం నోటీసులు జారీ చేయగా గ్రామస్తులు ఆందోళనకు దిగారు. 

నెల్లూరు: గతంలో కరోనా మందు పేరిట హల్ చల్ చేసిన కృష్ణపట్నం ఆనందయ్య (krishnapatnam anandaiah) తాజాగా ఒమిక్రాన్ (omicron) కు కూడా తనవద్ద మందు వుందంటూ ప్రకటించిన విషయం తెలిసిందే. గతంలో కరోనా (corona virus)కు ఇచ్చిన మందుకే మరికొన్ని మూలికలను జోడించి ఒమిక్రాన్ మందును తయారుచేశానని ఆనందయ్య తెలిపారు. కాబట్టి కరోనా కొత్త వేరియంట్ (corona new variant) రాకుండా ముందస్తుగా మందును తీసుకోవాల‌ని... ఇది ఒమిక్రాన్ పై సమర్థవంతంగా పనిచేస్తుందని ఆనంద‌య్య తెలిపారు. 

అయితే ఈ ప్రకటనే ఆనందయ్యను తాజాగా చిక్కుల్లోకి నెట్టింది. ఒమిక్రాన్ మందును ప్రజలకు పంపిణీ చేస్తానంటూ చేసిన ప్రకటనపై ప్రభుత్వం వివరణ కోరింది. నెల్లూరు జిల్లా (nellore district) జాయింట్ కలెక్టర్ ఆనందయ్యకు నోటీసులు జారీ చేసారు. స్థానిక ఎమ్మార్వో సోమ్లా నాయక్, మండల అధికారులు కృష్ణపట్నంలోని ఆనందయ్య ఇంటికి వెళ్లి నోటీసులు అందించారు. 

Video

ఒమిక్రాన్ ముందుకు ఆయుష్ అనుమతులు ఉన్నాయా? అని అధికారులు ఆనందయ్యను ప్రశ్నించారు. దీనిపై జేసీ కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాల్సిందిగా అధికారులు ఆనందయ్యను ఆదేశించారు. అప్పటివరకు ఒమిక్రాన్ మందు పంపిణీ చేపట్టవద్దని సూచించారు. 

read more Omicron Medicine రెడీ ..! ఆయూష్ అనుమ‌తిస్తే.. ఆన్‌లైన్‌లో సరఫరా.. Krishnapatnam Anandayya ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌

అయితే గతంలో కరోనా ముందుకు ఆయుష్ (ayush) అనుమతులు ఇచ్చిందని... ఒమిక్రాన్ కి ఇచ్చే మందులో కూడా అదే వనమూలికలు వాడుతున్నామన్న ఆనందయ్య తెలిపారు. రెండు రోజుల్లో కలెక్టరేట్ కి వచ్చి వివరణ ఇస్తానని ఆనందయ్య అధికారులకు తెలిపారు. 

ఇదిలావుంటే ఆనందయ్య మందు పంపిణీని కృష్ణపట్నం గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు. గతంలో ఆనందయ్య కరోనా మందు తీసుకోడానికి ఎక్కడెక్కడి నుండో రోగులు కృష్ణపట్నంకు రావడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యామని గ్రామస్తులు అంటున్నారు. కాబట్టి ఒమిక్రాన్ మందు పంపిణీకి గ్రామంలో అనుమతించేది లేదని కృష్ణపట్నం పంచాయతీ ఏకగ్రీవ తీర్మానం చేసింది.

ఒమిక్రాన్ అంటే ఏమిటో తెలీకుండానే ఆనందయ్య మందు ఎలా ఇస్తారని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. ఆయన మందు సంగతి ఎలాగున్నా దాని పంపిణీ గ్రామంలో చేపట్టరాదని... ఊరి అవతల ఏమైనా చేసుకోవాలని సూచించారు. గ్రామంలోనే మందు ఇస్తామంటే ఊరుకోమంటూ గ్రామస్థులు ఆనందయ్యను హెచ్చరించారు. 

read more Omicron Cases in India: భారత్‌లో 781కి చేరిన ఒమిక్రాన్ కేసులు.. మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు..

ఇక ఇప్పటికే ఆనందయ్య ఒమిక్రాన్ మందు ప్రకటనపై ఆయుష్ శాఖ స్పందించింది. కరోనా కొత్త వేరియంట్‌కు మందు ఇస్తున్నట్లు ఆనందయ్య దుష్ర్పచారం చేస్తున్నారని ఆయుష్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మందుకు తాము ఎలాంటి అనుమతి ఇవ్వలేదని వెల్లడించింది. 

ఆనందయ్య ఆయుర్వేద మందు సరఫరాకు కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని అధికారులు తెలిపారు. గుర్తింపులేని మందును ఆయుర్వేద వైద్యంగా భావించవద్దని ప్రజలకు ఆయుష్ శాఖ సూచించింది. వైద్యుల సలహాతోనే ఆయుర్వేద, హోమియో మందులు వాడాలని ప్రకటించింది.

గతంలో క‌రోనా సెకండ్ వేవ్ వ్యాప్తి వేగంగా ఉన్న‌ప్పుడూ కరోనాకు ఆనందయ్య కనిపెట్టిన ఆయుర్వేద మందు దేశవ్యాప్తంగా మార్మోగింది. కరోనాకు అప్పటికే వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నా.. ఆస్పత్రుల్లో చికిత్స చేస్తున్నా వాటిని కాదని, లక్షలాది మంది నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనంద‌య్య కరోనా ఆయుర్వేద మందు వాడారు. ఆయ‌న మందుకు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. సాధారణ ప్రజలతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఆయన మందు తీసుకున్నారు.