కొవ్వూరు: ధర్మవరంలో ఓ వృద్ధురాలిని అత్యంత దారుణంగా హత్య చేశారు. ఆమె నోట్లో గుడ్డలు కుక్కి, చేతులను కట్టేసి చంపేశారు. ధర్మవరం గ్రామానికి చెందిన కందుల వంసత రాజ్యలక్ష్మి (70) ఒంటరిగా జీవిస్తోంది. ఆమె ఇంట్లోని ఓ వాటాలో ఆమె నివాసం ఉంటోంది. 

మరో వాటాలో మృతురాలి బావ కుమారుడు రమేష్  ఉంటున్నాడు. ఆమె ప్రతి రోజూ గీతాపారాయణం చేసి రాత్రి పది గంటలకు నిద్రిస్తుంది. సోమవారం రాత్రి కూడా అదే రీతిలో నిద్రపోయింది. అదే గ్రామానికి చెందిన యశోద మహిళ మంగళవారం ఉదయం ఇంటికి వచ్చి ఎంతగా పిలిచినా రాజ్యలక్ష్మి నుంచి సమాధానం రాలేదు. 

తలుపులు తెరిచి ఉండడంతో లోనికి వెళ్లి చూసింది. రాజ్యలక్ష్మి మంచంపై విగత జీవిగా కనిపించింది. విషయం చుట్టుపక్కలవారికి తెలియడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. కొవ్వూరు డీఎస్పీ కె. రాజేశ్వర రెడ్డి, రూరల్ సీఐ సురేష్ తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. 

బంగారం కోసం వృద్ధురాలిని చంపి ఉంటారని తొలుత భావించారు. అయితే, బంగారం ఇంటిలో దొరికింది. దీంతో ఆమెను ఎందుకు చంపారనే విషయం మిస్టరీగానే ఉండిపోయింది. కారణం తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు.